close

తాజా వార్తలు

Published : 17/01/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఉపఎన్నికలో లబ్ధికే భాజపా యత్నం: వెల్లంపల్లి

ఏపీలో విగ్రహాల ధ్వంసాన్ని ఆధారాలతో సహా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ బయటపెట్టారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలపై డీజీపీ చెప్పినవన్నీ వాస్తవాలేనని చెప్పారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెదేపా, భాజపా నేతలు డీజీపీని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. భాజపాకు భయపడేందుకు తమది తెదేపా ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భాజపా నేతలు అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* డ్యాన్సర్లతో కలిసి చిందేసిన వైకాపా నాయకులు

2. గోల్కొండపై భాజపా జెండా ఎగరేస్తాం: బండి

గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర భాజపా మొదటి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భాజపా కార్యకర్తలు చేసిన సేవలు చాలా గొప్పవన్నారు. కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నలుగురు భాజపా కార్యకర్తలు కరోనాతో మరణించారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు

3. తిరుమల మాడ వీధుల్లో వరాహాల సంచారం

తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఇటీవల వరాహాల సంచారం అధికమైంది. ఆదివారం తెల్లవారుజామున ఓ వరాహ గుంపు ఆలయం సమీపంలోని తిరుమాడ వీధుల్లో సంచరించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో తరచూ వరాహాలు సంచరిస్తున్నా.. భద్రతా సిబ్బంది వాటిని నిలువరించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచే తిరుమలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం: తలసాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కోకాపేటలో ఇటీవల జరిగిన ముదిరాజ్‌ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో తాను గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ఏమైనా తప్పుగా ఉన్నాయని భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి గంగపుత్రుల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* కరీంనగర్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం

5. ఇది వింతలకే వింత.. :చిదంబరం

వ్యవసాయ చట్టాల పట్ల కేంద్రం అవలంబిస్తున్న వైఖరిని వింతల్లో కెల్లా వింతగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రకటనలో.. ‘‘వ్యవసాయ విధానాలపై చర్చానంతరం.. నీతి ఆయోగ్‌ కమిటీ  సంబంధిత నివేదికను సెప్టెంబర్‌ 2019లోనే సమర్పించింది. ఐతే 16 నెలలు గడిచినా ఇప్పటికీ దానిని నీతి ఆయోగ్‌ పాలక మండలికి సమర్పించనే లేదు. ఇలా ఎందుకు జరిగింది అనేది ఎవరికీ తెలీదు.. ఎవరూ సమాధానం చెప్పరు’’ అని ఆయన విమర్శించారు. ‘‘అంజలీ భరద్వాజ్‌ అనే సామాజిక కార్యకర్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా దరఖాస్తు చేశారు. కాగా, నివేదికను ఇంకా సమర్పించలేదనే సాకుతో ఆమె ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు అధికారులు నిరాకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్విటర్‌ ట్రెండింగ్‌లో..టీకా పంపిణీ

దేశంలో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమే ఎక్కువగా వైరల్‌ అయింది. ట్విటర్‌లో కొన్ని గంటల పాటు ‘లార్జెస్ట్‌వ్యాక్సిన్‌ డ్రైవ్‌’ ట్రెండింగ్‌లో కనిపించింది. 4.3 లక్షల ట్వీట్లకు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. టీకాలతో కరోనాపై నిర్ణయాత్మక విజయం సాధిస్తామంటూ భరోసా ఇచ్చిన ప్రధాని ప్రసంగంపైనా స్పందనలు హోరెత్తాయి. ఎక్కువశాతం నెటిజన్లు ప్రధానిని ప్రశంసల్లో ముంచెత్తారు. పెద్దఎత్తున ప్రారంభించిన వ్యాక్సినేషన్‌లో పారదర్శకత లోపిస్తోందంటూ కొందరు ప్రముఖులు విమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 56.79 లక్షల కొవిడ్‌ క్లెయిమ్‌ల పరిష్కారం

ఈపీఎఫ్‌వో 56.79లక్షల  కొవిడ్‌ క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇవన్నీ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ క్లెయిములే. ఇప్పటి వరకు వీటికి సంబంధించి డిసెంబర్‌ 31 నాటికి రూ.14,310 కోట్లను విడుదల చేసింది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులు ఏస్థాయిలో కొవిడ్‌ దెబ్బకు ఇబ్బంది పడ్డారో ఈ క్లెయిమ్‌లే వెల్లడిస్తున్నాయి. మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఉద్యోగులు ఈపీఎఫ్‌వో నుంచి నిధులను డ్రా చేసుకోవడానికి అనుమతించింది. ఇది ఆ ఉద్యోగి మూడునెలల బేసిక్‌, డీఏను మించకుండా ఉండాలి. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈ వెసులుబాటును కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గబ్బా కాదు..శార్దూల్‌-సుందర్‌ల దాబా: సెహ్వాగ్‌

టీమిండియా అద్వితీయ ప్రదర్శనకు ఆస్ట్రేలియా బిత్తరపోతోంది. ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా భారత జట్టులో అదే పట్టుదల, అదే కసి! గబ్బా వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆతిథ్య జట్టుకు టీమిండియా దీటుగా సమాధానమిస్తోంది. 188/6తో కష్టాల్లో పడిన జట్టును కుర్రాళ్లు శార్దూల్ ఠాకూర్‌ (67), వాషింగ్టన్ సుందర్ (62) అర్ధశతకాలతో ఆదుకున్నారు. అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌పై ఆధిపత్యం చెలాయించారు. ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 33 పరుగులకే పరిమితం చేశారు. అయితే సుందర్‌కు ఇది తొలి టెస్టు కాగా, శార్దూల్‌కు రెండో మ్యాచ్. ఈ నేపథ్యంలో శార్దూల్, సుందర్‌ అసాధారణ పోరాటంపై మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* క్రికెట్‌ మైదానంలో అలరించిన స్టార్‌వార్స్‌ 

* ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్‌

9. వాడకం తగ్గినా.. వసూళ్లు పెరిగాయ్‌!!

కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. జీఎస్టీ వసూళ్లు కనిష్ఠ స్థాయికి చేరాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు భారీగా పడిపోయాయి. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల వచ్చే ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్‌ సుంకం పెంచడమే ఇందుకు కారణం! గతేడాది సాధారణం కంటే వీటి అమ్మకాలు భారీగా తగ్గినప్పటికీ పన్ను వసూళ్లు పెరగడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020) ఏప్రిల్‌- నవంబర్‌ మధ్య ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.1,96,342 కోట్ల మేర ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఈ మొత్తం రూ.1,32,899 కోట్లుగా ఉందని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ గణాంకాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చైనా ఐస్‌క్రీంలో కరోనా ఆనవాళ్లు..!

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనా వైరస్‌ ఆనవాళ్లపై రోజుకో ప్రకటన చేస్తోంది. తాజాగా అక్కడ తయారైన ఐస్‌క్రీంలోనూ కరోనా వైరస్‌ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించింది. గతకొద్ది రోజులుగా చైనాలో కరోనా వైరస్‌ తీవ్రత మళ్లీ పెరుగుతోన్న వేళ, చైనా తాజా ప్రకటన కలకలంరేపుతోంది. బీజింగ్‌కు సమీపంలోని తియాన్జిన్‌ ప్రాంతంలోని ఓ ఫుడ్‌ కంపెనీ తయారుచేసిన ఐస్‌క్రీంలో కరోనా ఆనవాళ్లు కనిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ బ్యాచ్‌లో ఉత్పత్తి అయిన వేల కార్టన్లను సదరు సంస్థ వెనక్కి తీసుకుంటోంది. ఈ బ్యాచ్‌లో ఇప్పటివరకు 390 కార్టన్లను మాత్రమే విక్రయించారని, మరో 29వేల కార్టన్న ఐస్‌క్రీంలను ఇంకా విక్రయించలేదని చైనా అధికారులు స్పష్టంచేశారు. ఈ అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని