close

తాజా వార్తలు

Published : 18/01/2021 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను సికింద్రాబాద్‌ కోర్టు తిరస్కరించింది. ఆమెపై అదనపు సెక్షన్లు నమోదుచేసినట్లు పోలీసులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో అఖిలప్రియ సహా ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

*  హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో దారుణం

2. మరుగుదొడ్ల నిర్వహణ ప్రాధాన్యతాంశం: జగన్‌

ఫిబ్రవరి 1నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిలెట్లు ఉండాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ ప్రాధాన్యతాంశమని చెప్పారు. టాయిలెట్లు లేకపోవడం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలా వరకు పిల్లలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కారణంగా దీన్ని ప్రాధాన్యతా కార్యక్రమంగా చేపట్టినట్లు వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సీఎం సోమవారం సమీక్షించారు. టాయిలెట్‌ నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, కళాశాల, పాఠశాల స్థాయుల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నెల్లూరు ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే బెదిరింపులు

3. బైక్‌ అంబులెన్స్‌ రూపొందించిన డీఆర్డీవో

మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్‌తో కలిసి బైక్ అంబులెన్స్‌ను డీఆర్డీవో రూపొందించింది. దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు డీఆర్డీవో తెలిపింది. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్‌లు  వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్‌ వెల్లడించింది. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 27 నగరాల్లో మెట్రో రైలు.. మోదీ

దేశంలోని 27 నగరాల్లో వెయ్యి కిలోమీటర్లకు పైగా నిడివిగల వివిధ మెట్రో రైల్‌ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలిపారు. అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ రెండో దశ, సూరత్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌లకు నేడు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రెండు ప్రధాన వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్‌, సూరత్‌ల్లో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయన్నారు. మెట్రో ప్రాజెక్టు ఈ రెండు నగరాల ప్రజలకు పర్యావరణహిత ప్రజా రవాణా సాధనం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తా: మమత

రానున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తెలిపారు. ప్రస్తుతం భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక నేత సువేందు అధికారి పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన  స్థానమైన నందిగ్రామ్‌ నుంచి మమత పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ నేను నందిగ్రామ్‌ నుంచి పోటీచేస్తాను. అది నాకు అదృష్టాన్నిచ్చే ప్రాంతం.’’ అని మమత సోమవారం జరిగిన ఓ ఎన్నికల  సమావేశంలో తెలిపారు.  భవానిపుర్‌ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు మమత వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒప్పో నుంచి మరో 5జీ ఫోన్‌

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానప్పటికీ 5జీ సపోర్ట్‌ చేసే ఫోన్లు మాత్రం మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. గతేడాదే తొలి 5జీ ఫోన్‌ తీసుకొచ్చిన ఒప్పో.. తాజాగా భారత మార్కెట్లోకి మరో ఫోన్‌ను విడుదల చేసింది. గతేడాది రెనో సిరీస్‌లో తీసుకొచ్చిన 4ప్రో కు కొనసాగింపుగా రెనో 5 ప్రో 5జీని సోమవారం లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ 8జీబీ/ 128జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.35,990గా నిర్ణయించింది. జనవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఇండియా ఈ-స్టోర్‌తో పాటు ఇతర ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో లభ్యం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై 10 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ కార్డులపై రూ.2,500 మేర క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. పేటీఎం ద్వారా కొనుగోలుపైనా డిస్కౌంట్‌ లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవ‌లు 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ‌ వినియోగదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఇక‌ నగదును కూడా డోర్ డెప్ డెలివరీ సేవల కింద జారీచేయ‌నుంది. ఈ సౌకర్యంతో వినియోగదారులు వారి ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవల సౌలభ్యాన్ని పొంద‌వ‌చ్చు.  మీ బ్యాంక్ ఇప్పుడు మీ ఇంటి వద్ద ఉంది. ఈ రోజు డోర్స్టాప్ బ్యాంకింగ్ కోసం నమోదు చేయండి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ సిలబస్‌తోనే సీబీఎస్‌‌ఈ పరీక్షలు, జేఈఈ, నీట్‌

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు, పలు పోటీ పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ కీలక ప్రకటన చేశారు. సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్‌, నీట్‌ వంటి పోటీ పరీక్షలు తగ్గించిన సిలబస్‌తోనే ఉంటాయని స్పష్టంచేశారు. సోమవారం కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులతో నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. దేశంలో కరోనా భయం నెలకొన్న వేళ పరీక్ష కేంద్రాలకు వెళ్లడంపై ఓ విద్యార్థి ఆందోళన వ్యక్తంచేస్తూ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. పరీక్షలు చుట్టూ ఉన్న అంశాలపై భయపడాలి గానీ.. పరీక్షా కేంద్రాలకు వెళ్లడంపై ఆందోళనే అవసరం లేదని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ప్రపంచం కష్టాల్లో ఉన్నా.. చైనా వృద్ధిబాటలో..

చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ప్రతిచోటా కల్లోలం సృష్టించింది. అనేక రంగాలను ఛిన్నాభిన్నం చేసింది. అన్ని దేశాల వృద్ధిరేటుపై గట్టిదెబ్బ కొట్టింది. కరోనా కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అయితే, ఇలాంటి సమయంలో మహమ్మారి పుట్టినిల్లయిన చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం పుంజుకోవడం గమనార్హం. 2020లో ఆ దేశ జీడీపీ 2.3శాతం పెరిగింది. ఈ మేరకు చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌(ఎన్‌బీఎస్‌) సోమవారం డేటా విడుదల చేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన చైనా జీడీపీ 2020లో 2.3శాతం పెరిగి 13.42 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఆ దేశ కరెన్సీ ప్రకారం.. ఈ విలువ 101.5986 ట్రిలియన్‌ యువాన్లు. కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్‌ చేసిన సుందర్‌

టీమ్ఇండియా యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి అని అతడి తండ్రి ఎం.సుందర్‌ తెలిపారు. తొమ్మిదేళ్ల వయసులో తలకు దెబ్బతగిలి కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి క్రికెట్‌ ఆడాడని వెల్లడించారు. తన కుమారుడిని ఎక్కువ మంది స్పిన్నర్‌గా భావిస్తారని నిజానికి అతడు 70% బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్ ‌ముందు వాషింగ్టన్‌ తనతో మాట్లాడాడని వెల్లడించారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన సుందర్‌ బ్యాటు, బంతితో అదరగొడుతున్నాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లు విసిరి 89 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 18 ఓవర్లు విసిరి 80 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశాడు. ఇక టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి 144 బంతుల్లో 62 పరుగులు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని