
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. ‘ప్రత్యేకహోదాను వైకాపా తాకట్టు పెట్టింది’
జగన్ సర్కారు ప్రత్యేక హోదా హామీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. రెవెన్యూ లోటు ఉందని చెబుతున్న వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని భర్తీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ దిల్లీకి చాలా సార్లు వచ్చారు. ఇంకా రావచ్చు కూడా. అయితే ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న హామీలను ఎంత వరకు సాధించారు? ఆ చట్టంలో ఉన్న సమస్యలపై మాట్లాడారా.. పరిష్కారం జరిగిందా?ఒకవేళ మాట్లాడితే కేంద్రం ఏం చెప్పింది?’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* నల్లపురెడ్డి మాటలు వినిపించలేదా?: జేసీ
* అలజడి తగ్గించేందుకే పర్యటన: చినజీయర్ స్వామి
2. ఎల్ఆర్ఎస్పై హైకోర్టు కీలక ఆదేశం
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆ పథకాలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో బీఆర్ఎస్ పథకం తీసుకొచ్చింది. ఇటీవల ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు స్వీకరించింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 2016లో తీసుకొచ్చిన బీఆర్ఎస్ పథకంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నంటిపై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఉద్రిక్తంగా ప్రజాభిప్రాయ సేకరణ
3. కమిటీ సభ్యులను కించపరుస్తారా?
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏర్పాటు చేసిన కమిటీపై కొందరు రైతు సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి ప్రకటించింది. తాము కమిటీ సభ్యులకు ఎలాంటి నిర్ణయాధికారం ఇవ్వలేదని, అలాంటప్పుడు వారిని కించపర్చేలా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై గతవారం స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో భూపీందర్‌సింగ్ మాన్, ప్రమోద్ కుమార్, అశోక్ గులాటి, అనిల్ ఘన్వత్ ఉన్నారు. అయితే ఈ కమిటీని కొందరు రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రోజుకు 10లక్షల మందికి టీకా: ఈటల
ప్రజారోగ్యం విషయంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్య పరీక్షల ఖర్చు తగ్గించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కరోనా వ్యాక్సినేషన్లోనూ తెలంగాణ తనదైన ముద్ర వేసిందన్న మంత్రి.. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన కొవాగ్జిన్ మరింత సమర్థవంతంగా పని చేస్తుందని ఆశిస్తున్నట్లు ఈటల తెలిపారు. త్వరలోనే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి టీకా పంపిణీ చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. 30న మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ బుధవారం వెల్లడించారు. ఈ సమావేశం వర్చువల్ విధానంలో జరగనుందని తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపామన్నారు. ప్రతి పార్లమెంట్ సెషన్‌కు మందు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కానీ, ఈ సారి దానికి భిన్నంగా సెషన్ 29వ తేదీనే మొదలవుతుండగా.. మీటింగ్‌ను మాత్రం 30వ తేదీన ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* పదో రౌండ్ చర్చలు.. పరిష్కారం దొరుకుతుందా?
6. ‘పల్లెదారి’ పట్టండి..!
ప్రభుత్వం పల్లెల్లో రోడ్లపై దృష్టిపెడితే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సహజంగానే పెరుగుతుందని అసోచామ్ (ది అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) పేర్కొంది. అంతేకాదు జీఎస్టీ రేట్ల సవరణ, విద్య,వైద్యంపై వ్యయాల్ని పెంచడం వంటి పలు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచింది. వచ్చే బడ్జెట్లో ద్రవ్యలోటును నిస్పంకోచంగా పక్కనపెట్టి తయారు చేయాలని పేర్కొంది. భారత్‌లో వ్యయాలను పెంచడానికి, ఎగుమతులను పెంచడానికి రవాణ రంగం ప్రధానంగా ఉపయోగపడుతుందని ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ, అసోచామ్ అధ్యక్షుడు వినీత్ అగర్వాల్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఆస్ట్రేలియన్ నోట ‘భారత్ మాతా కీ జై’
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా భిన్న అనుభూతుల్ని పొందింది. ఊహించని గాయాలు, 36 పరుగులకే ఆలౌటవ్వడం, గబ్బాలో చారిత్రక విజయం, కొందరు ఆస్ట్రేలియన్ల నుంచి జాత్యహంకార వ్యాఖ్యలు.. ఇలా టెస్టు సిరీస్‌లో ఎన్నో ఎదురయ్యాయి. అయితే గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో జ్ఞాపకంగా నిలిచిపోయే మరో సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా పోరాటానికి ముగ్ధుడైన ఓ ఆస్ట్రేలియన్...భారత్ మాతా కి జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. అతడితో పాటు భారతీయులు కూడా జై కొట్టడంతో స్టేడియం దద్దరిల్లింది. ఈ రమణీయమైన దృశ్యం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* మైదానంలోనే భారత్-ఆసీస్ పోటీదారులు
8. బైడెన్ ప్రమాణస్వీకారం.. ఆసక్తికర విషయాలు
మరికొన్ని గంటల్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ భవనంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. గతేడాది నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై 78ఏళ్ల బైడెన్ ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజల సమక్షంలో ప్రమాణం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* మరో 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష!
9. టీకా తెరిస్తే ఆలోగా వాడేయాలి.. లేదంటే
ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమాన్ని భారత్ విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాల వాడకంపై వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు.. ఒకసారి సీలు తెరిచిన సీసాలోని టీకాను.. నాలుగు గంటల్లోగా ఉపయోగించాలని వారు ప్రకటించారు. అనంతరం అవి నిర్వీర్యం అవుతాయని.. వాటిని నాశనం చేయాలని తెలిపారు. ‘‘ప్రతి 5 ఎం.ఎల్ వ్యాక్సిన్ సీసా 10 డోసులను కలిగి ఉంటుంది. ఒకసారి దీనిని తెరిచిన అనంతరం అందులో ఉండే పది డోసులను నాలుగు గంటల్లోగా వాడేయాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియాపై అద్వితీయ విజయం సాధించిన భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యంగా పోరాడిన యువ ఆటగాళ్లను కొనియాడుతున్నారు. అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ టీమిండియాకు అభినందలు చెబుతూనే హెచ్చరిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్‌ను ఉద్దేశిస్తూ.. కోహ్లీసేనకు త్వరలో అసలైన సవాలు ఎదురుకానుందని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ హిందీలో చేయడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి