Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 18/06/2021 20:55 IST

Top Ten News @ 9 PM

1. కరోనా విలయం: 40 లక్షల మంది బలి!

కరోనా వైరస్‌ సృష్టించిన విలయానికి యావత్ ప్రపంచం వణికిపోయింది. వైరస్‌ బయటపడిన ఏడాదిన్నర కాలంలోనే లక్షల మందిని బలి తీసుకుంది. తాజాగా అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 40లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలోనే 20లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 లక్షల మరణాలు కేవలం ఐదున్నర నెలల్లోనే చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చనిపోతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయుడు ఉంటున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. కొన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ.. కొవిడ్‌ మరణాలు మాత్రం ఆగడం లేదు. రాయిటర్స్‌ వార్తాసంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 40 లక్షల మార్కుని దాటింది

ap news: కొత్తగా 6,341 కరోనా కేసులు
Ts News: కొత్తగా 1,417 కొవిడ్‌ కేసులు

2. Ts News: నకిలీ పత్రాలతో భారీ మోసం

నకిలీ పత్రాలతో స్థిరాస్తి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. యజమానులకు తెలియకుండా నకిలీ దస్త్రాలు సృష్టించి ఇతరులకు భూమి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు. ఈ కేసుకు  సంబంధించిన వివరాలను సజ్జనార్‌ మీడియాకు వివరించారు. ప్రధాన నిందితుడు ఆదినారాయణ మూర్తితో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. ఆదినారాయణ మూర్తికి తొమ్మిది రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తే అక్కడ ఆ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

3. అది ‘డాబు క్యాలెండర్‌’: లోకేశ్‌

సీఎం జగన్‌ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్‌’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 2.30లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ .. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని 54వేల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చినట్టు మోసపు ప్రకటన ఇచ్చారని ఆక్షేపించారు. వైకాపా కార్యకర్తలకు వాలంటీర్లు, వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు వేసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్టు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు వేయించే వైకాపా కార్యకర్తల్ని వాలంటీర్లుగా నియమించటం వివక్ష లేకపోవడమా అని ప్రశ్నించారు. 

4. CBSE ‘పది’ ఫలితాలు ఎప్పుడంటే? 

పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సీబీఎస్‌ఈ బోర్డు కసరత్తు చేస్తోంది. జులై 20 నాటికల్లా వెల్లడించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే రద్దయిన 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానాన్ని సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ బోర్డు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ మాట్లాడుతూ.. జులై 20కి పదో తరగతి పరీక్షల ఫలితాలు, జులై 31 నాటికి 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందువల్ల చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకొంటున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 

5. Corona: టీకాలతో 94 శాతం రక్షణ

కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కరోనా టీకాలు 94 శాతం రక్షణ కల్పిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆక్సిజన్ అందించాల్సిన అవసరాన్ని 8 శాతానికి, ఐసీయూలో చికిత్స తీసుకునే పరిస్థితిని 6 శాతానికి తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. అయితే టీకాలు తీసుకున్నప్పటికీ నిబంధనల విషయంలో అజాగ్రత్త వద్దని హెచ్చరించింది. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో దేశంలోని కొవిడ్ పరిస్థితిని వివరించింది. అలాగే వైద్యులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించింది. మే 3 నుంచి దేశంలో రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు 96 శాతానికి చేరింది. గురువారం 88,977 మంది కోలుకోగా, మొత్తం రికవరీలు 2.85 కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 8లక్షల దిగువకు చేరాయి.

6. Economy: ద్వితీయార్ధంలోనే ఆర్థిక వ్యవస్థ గాడిలోకి

కరోనా రెండో దశ ఉద్ధృతిని కట్టడి చేయడం  కోసం విధించిన లాక్‌డౌన్ల కారణంగా జూన్‌ త్రైమాసికపు వృద్ధి రేటు 12 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సైతం లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం కుదించుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆంక్షల ఎత్తివేతతో తర్వాతి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు పుంజుకుంది. దీంతో వి-ఆకారపు పునరుత్తేజం కనిపించింది. కానీ, ఈసారి 12 శాతం క్షీణత నుంచి వి-ఆకారపు పునరుత్తేజానికి అవకాశం లేదని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ నివేదిక అభిప్రాయపడింది. మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో ఇంకా ఆందోళన నెలకొని ఉండడమే అందుకు కారణమని వెల్లడించింది.

Paytm IPO: తాజా ఈక్విటీ షేర్లతోనే రూ.12వేల కోట్లు!

7. Third Wave: అక్టోబర్‌నాటికి మూడో ముప్పు..?

కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి వణికిపోయిన రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు భావిస్తోన్న రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నాటికి థర్డ్‌వేవ్ సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే మూడో ముప్పును సమర్థంగానే నియంత్రించే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి, రానున్న రోజుల్లో వైరస్‌ ప్రభావం గురించి జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో రాయిటర్స్‌ వార్తా సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. జూన్‌ 3 నుంచి 17 మధ్య చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 40మందికి పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు. 

8. Covaxin: భారత్‌ బయోటెక్‌కు శుభవార్త

తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్ తయారీదారు భారత్‌ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి శుభవార్త అందింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ లిస్టింగ్ (ఈయూఎల్‌)కు అనుమతించే పత్రాలు సమర్పించేందుకు అంగీకరించింది. ఈనెల 23న టీకా డేటా వివరాలు అందజేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇది కొవాగ్జిన్  టీకాపై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం కాదని, వ్యాక్సిన్ మొత్తం డేటా సమర్పించేందుకు ఉద్దేశించిన భేటీగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గాలు తెలిపాయి.

9. అమ్మమ్మ షరతు.. బతికొచ్చిన బాలుడు

బతికుండగానే ఆ బాలుడు మృతిచెందినట్లు ధ్రువీకరించారు దిల్లీ వైద్యులు. దీంతో తమ ఏడేళ్ల కుమారుడి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. అయితే అంత్యక్రియలు ఆలస్యం కావడంతో అతడి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన హరియాణాలోని జజ్జర్ జిల్లాలో వెలుగుచూసింది. కిలా ప్రాంతానికి చెందిన విజయ్ శర్మ మనవడు కునాల్ శర్మ టైఫాయిడ్‌తో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బహదూర్‌గంజ్​లోని బాలుడి మామ ఇంటి సమీపంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

10. WTC Final: తొలి రోజు ఆట రద్దు 

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలిరోజు ఆట నిలిచిపోయింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో శుక్రవారం తొలిరోజు ఆట సగం రోజు వరకు సాగలేదు. తొలుత తొలి సెషన్‌ వరకు వేచి చూడగా, భోజన విరామం అనంతరం సైతం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ క్రమంలోనే వరుణుడు కాస్త కనికరించినా.. మైదానమంతా వర్షం నీరు ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. రేపటి నుంచి మ్యాచ్‌ సజావుగా సాగితే తొలిరోజు కోల్పోయిన సమయాన్ని రిజర్వ్‌డే రోజు నిర్వహించే అవకాశం ఉంది.

WTC Final: భారత్‌ తుది జట్టులో మార్పులు?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని