
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. అడకత్తెరలో ట్రంప్
అమెరికాలో ఒకవైపు నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపడుతుండగా.. మరోవైపు రోజురోజుకూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. క్యాపిటల్ భవనంపై అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదార్లు దాడి చేసిననాటి నుంచి పరిస్థితులు అనూహ్యంగా తయారయ్యాయి. ప్రతినిధుల సభలో ట్రంప్‌పై సోమవారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి డెమొక్రాట్లు సన్నాహాలు చేస్తుండడం కీలక విషయం. ఇందుకు ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ సభ్యులే మద్దతు తెలుపుతుండడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఇల్లు కట్టేదెలా..!
ఉక్కు ధరలు ఎక్కడో ఉన్నాయి! సిమెంటు ధరలకు రెక్కలొచ్చాయి!! ఇసుకను బ్లాక్మార్కెట్లో కొనాల్సి వస్తోంది. రూపాయి రూపాయి దాచుకుని సొంత ఇల్లు కట్టుకోవాలనో, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనో అనుకునే వారికి పెరిగిన ధరలు అశనిపాతమవుతున్నాయి. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కరోనాతో పూర్తిగా స్తంభించి.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని ఈ పరిణామాలు కుంగదీస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. 16 వేల కి.మీ ఎగిరొచ్చిన నారీశక్తి!
ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్లు అరుదైన ఘనత సాధించారు. అత్యంత సుదూరం ప్రయాణం చేసి విజయవంతంగా తిరిగొచ్చారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 16,000 కి.మీ దూరం ప్రయాణం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నలుగురు పైలట్లు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. భాగ్యనగరమా.. ఊపిరి పీల్చుకో!
భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంది. 2019తో పోల్చితే గతేడాది కాలుష్యం కొంత వరకు తగ్గింది. స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తూ, నగరవాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ధూళి కణాల(పీఎం 10) తీవ్రత అన్ని ప్రాంతాల్లోనూ తగ్గింది. కాకపోతే.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితులకు మించి నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో వాహనాలు రోడ్డెక్కకపోవడమే ఈ తగ్గుదలకు కారణమని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. 18 నుంచి 1400 కేంద్రాల్లో టీకా
రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి కొవిడ్ టీకా పంపిణీ కేంద్రాలను పెంచనున్నారు. ఈనెల 16న టీకాల పంపిణీ ప్రారంభం రోజున 139 కేంద్రాలను ఎంపిక చేయగా.. అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 40, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 99 కేంద్రాలున్నాయి. తొలిరోజు మొత్తం కేంద్రాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనివే ఎక్కువ. వీటిలో హైదరాబాద్(13), మేడ్చల్(11), రంగారెడ్డి(9) జిల్లాల్లో కలుపుకొని 33 టీకా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సబ్బులు, బిస్కెట్లధరలూ పెరగనున్నాయ్
రోజువారీ వినియోగించే సబ్బులు, షాంపూలు, నూనెలు, బిస్కెట్ల వంటి ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ధరలు 4-5 శాతం మేర పెంచేందుకు ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ముడి పదార్థాల వ్యయం పెరగడమే ఇందుకు కారణమంటున్నాయి. ఇప్పటికే మారికో, ఇతర కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల పెంపును ధ్రువీకరించాయి. డాబర్, పార్లే, పతంజలి లాంటి సంస్థలు కూడా ధరల పెంపుపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఎగరొచ్చు... ఎదగొచ్చు!
అంతరిక్ష రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తీ, అభిరుచీ మీకున్నాయా? అయితే సాంకేతికంగా అన్ని రంగాల విజ్ఞానం పెంపొందించుకుంటూ ఎదగొచ్చు. ఆకర్షణీయమైన భవిష్యత్తు ఉన్న ‘ఏవియానిక్స్’ ఇంజినీరింగ్ మీలాంటి వారికి మంచి ఎంపిక! ఆకాశయానం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది- తెల్లటి యూనిఫామ్, తలపై తెల్లని టోపీ ధరించి ఠీవిగా కాక్‌పిట్‌ను స్వాధీనంలోకి తీసుకుని విమానాన్ని గగనతలంలోకి దూసుకువెళ్లేలా చేసే పైలట్. ప్రయాణికులను సుదూర గమ్యాలకు క్షేమంగా చేర్చే విధిని పైలట్ సక్రమంగా నిర్వర్తించాలంటే ఆ విమానంలోని ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచెయ్యాలి. ఈ వ్యవస్థల నిర్మాణ, నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు చేపట్టేవారే ఏవియానిక్స్ ఇంజినీర్లు! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పద్మశ్రీ తుర్లపాటి అస్తమయం
ప్రముఖ పాత్రికేయులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(87) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో చికిత్స చేస్తుండగా 12.30 గంటలకు గుండెపోటు రావడంతో తుర్లపాటి కన్నుమూశారు. కుటుంబరావు 1933 ఆగస్టు 10న విజయవాడలో సుందర రామానుజరావు, శేషమాంబ దంపతులకు జన్మించారు. తన 14వ ఏట 1946లో పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి తనదైన ముద్రవేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. వాహనంతో తొక్కించి మహిళ హత్య
పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువు వారిని తన వాహనంతో ఢీకొట్టాడు. అంతటితో ఆగక మీదికెక్కించి మహిళను అంతమొందించాడు. గాయాలతో తప్పించుకున్న ఆమె భర్త, కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యంత హేయమైన ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో సంచలనం రేపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. పంత్ సెంచరీ మిస్
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(97; 118 బంతుల్లో 12x4, 3x6) తృటిలో శతకం కోల్పోయాడు. పుజారా(58*; 181 బంతుల్లో 9x4)తో కలిసి నాలుగో వికెట్‌కు 148 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు. ఐదోరోజు భోజన విరామం తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లపై పంత్, పుజారా ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే లైయన్ వేసిన 80వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడబోయి గల్లీ పాయింట్లో కమిన్స్ చేతికి చిక్కాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి