
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. ఇలా వైరస్‌ను గుర్తిస్తుంది.. అలా దాడి చేస్తుంది
కరోనా టీకా వచ్చేసింది.. వైరస్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద అండ దొరికింది. ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే భరోసా! వ్యాక్సిన్ తీసుకున్నాక అది ఎలా పనిచేస్తుంది? వైరస్‌ను ఎదుర్కొనే శక్తిని ఎలా ఇస్తుంది అనే వివరాలు అత్యంత ఆసక్తికరం. సాధారణంగా ఏ టీకాను తీసుకున్నా.. సంబంధిత వైరస్, బ్యాక్టీరియాలను సమర్థంగా ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థను అది బలోపేతం చేస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. కొన్నేళ్ల తర్వాత వైరస్, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించినా.. రోగ నిరోధక వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్న కణాలు వాటికి వ్యతిరేకంగా పోరాడి, నాశనం చేస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. వెనక్కి తగ్గిన వాట్సాప్!
కొత్త ప్రైవసీ విధానంపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. మూడు నెలల పాటు అప్డేట్ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా..తాజా నిర్ణయంతో అది మరికొంత కాలం నిలిచిపోనుందని తెలిపింది. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై ఇటీవల వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ప్రభుత్వ వ్యయం తగ్గడం ఆందోళనకరం
కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గిందని.. ఇది ఆందోళనకరమని సుప్రసిద్ధ ఆర్థికవేత్త, రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ సి. రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వృద్ధి పుంజుకునేందుకు ప్రభుత్వ వ్యయం పెరగాలని, రాబోయే బడ్జెట్లోనూ దీనికి ప్రాధాన్యమివ్వాలని ఆయన ‘ఈనాడు- ఈటీవీ’లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రత్యేకించి ప్రభుత్వం పెట్టుబడి వ్యయాన్ని పెంచాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
ఈ చిత్రంలో ఉల్లాసంగా ఉన్న మహిళలు.. 20 ఏళ్ల కిందట బాల్య స్నేహితులు. సంక్రాంతి సందర్భంగా గోవా విహారయాత్రకు సిద్ధమై ఇలా ఫొటో దిగారు. కర్ణాటకలోని దావణగెరె నుంచి బయలుదేరారు. విధి వక్రించింది. 3, 4 గంటలు ప్రయాణించాక రోడ్డు ప్రమాదంలో వారి వాహనం తునాతునకలై పది మంది బాల్య స్నేహితురాళ్లతో సహా 13 మంది తుదిశ్వాస విడిచారు. చిత్రంలోని కొందరు కన్నుమూయగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కట్టాలంటే కష్టాలే
వెయ్యి చదరపు అడుగుల మేర ఇంటి నిర్మాణంలో శ్లాబుకు మూడు నెలల కిందట రూ.నాలుగు లక్షల ఖర్చయ్యేది. అంతే విస్తీర్ణంలో శ్లాబు నిర్మాణానికి ఇప్పుడు రూ.ఆరు లక్షలు వ్యయమవుతోంది. కేవలం శ్లాబు నిర్మాణానికే నెలల వ్యవధిలో రూ. రెండు లక్షల భారం పెరగడం సామాన్యులకు అశనిపాతమే. ఇసుక తప్ప, మిగిలిన అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతుండడంతో నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతోంది. క్కు ధరలకు రెక్కలొచ్చాయి. సిమెంటు ధరలు మంట పుట్టిస్తున్నాయి. రూపాయి రూపాయి దాచుకుని సొంత ఇల్లు సమకూర్చుకోవాలనుకున్న వారి కల వాయిదా పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* నమ్మండి...పోటీలోకి సైకిల్‌వాలా టీ!
6. జూన్ రెండో వారంలో ఎంసెట్!
వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఎంసెట్‌ను జూన్ రెండో వారంలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈసారి ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభించి, మే రెండో వారానికి పూర్తి చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు యోచిస్తున్నారు. అవి ముగిశాక, 4, 5 వారాల సమయం ఇచ్చి ఎంసెట్‌ను జూన్‌లో జరపాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆ నెలలోనే జరిపేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. భార్గవ్‌రామ్ తల్లి, సోదరుడి ప్రమేయం?
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చింది. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను మినహా మిగిలిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా భార్గవ్‌రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లకు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించుకున్నారు. ఇదే విషయాన్ని రిమాండ్ నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అఖిలప్రియ సోదరుడి ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. నీ జ్ఞాపకాలను.. తలచుకుంటుంటా
సంక్రాంతి అంటే జానూకి ప్రాణం. తెల్లవారుజామునే లేచి సిద్ధమయ్యేది. కల్లాపి జల్లి ముగ్గుతో ముంగిలిలోకి వచ్చేది. తనా పనిలో ఉంటే నా కళ్లు ఆరాధనగా చూసేవి. ముగ్గు వేయడానికే దేవుడు తనని పుట్టించాడేమో అన్నంత అందంగా వేసేది. ఇంధ్రధనుస్సుని భువికి దించినట్టు రంగులద్దేది. తర్వాత ఓసారి నావైపు కొంటెచూపు విసిరి ఎలా ఉందంటూ కనుసైగ చేసేది. ‘అబ్బే.. ఈసారేం బాలేదు’ అనేవాణ్ని ఏడిపించడానికి. అలిగి బుంగమూతి పెట్టేది. కలిసినప్పుడు మూగనోము పట్టేది. ‘సరదాగా అన్నానబ్బా’ అని సారీ చెబితే మళ్లీ మాటలు పోటెత్తేవి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. రెరా మధ్యే మార్గం
తెలంగాణ రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా)కు కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 200 వరకు వచ్చాయి. చాలావరకు బిల్డర్లు, కొనుగోలుదారులను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వంతో సమస్యలను రెరా పరిష్కరిస్తోంది. ఈ మేరకు చట్టం అవకాశం కల్పిస్తోంది. 20 వరకు ఫిర్యాదులపై రెరా తీర్పు వెలువరించాల్సి ఉంది. పలు రాష్ట్రాల్లో రెరా చురుగ్గా ఉండగా.. తెలంగాణలో ఇంకా వేగం అందుకోలేదు. కొనుగోలుదారులకు భరోసా పెరిగితే ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. గబ్బా టెస్టు: తొలి వికెట్ కోల్పోయిన భారత్
గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్(7) ఔటయ్యాడు. కమిన్స్ వేసిన 6.2వ ఓవర్‌కు స్లిప్‌లో స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పుజారా క్రీజులోకి రాగా రోహిత్(4) పరుగులతో ఆడుతున్నాడు. 7 ఓవర్లకు టీమ్ఇండియా స్కోర్ 11/1గా నమోదైంది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369