
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. ఇంకా అస్పష్టతే
పంచాయతీ ఎన్నికలపై అదే ఉత్కంఠ. నామినేషన్ల స్వీకరణ రోజు వచ్చినా అదే అస్పష్టత. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆదేశాలు, ధిక్కరణలు, కోర్టుల్లో కేసుల దశను దాటి.. నామినేషన్ల రోజూ వచ్చింది. కానీ నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఎలాంటి సన్నాహాలూ చేయలేదు. అసలు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలూ అందలేదు. మరి నామినేషన్ల ఘట్టంలో తొలి రోజైన సోమవారం ఏం జరగబోతోంది? ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ప్రిలిమ్స్ తీసేద్దామా?
ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో ప్రిలిమ్స్ (ప్రాథమిక పరీక్ష) తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాలోచనలు చేస్తోంది. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించి నియామకాలను త్వరితంగా చేపట్టాలన్న ఉద్దేశంతో పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించడంపై కమిషన్‌లో చర్చ జరుగుతోంది. ఏపీపీఎస్సీ గ్రూపు-1 ఉద్యోగాలను యథావిధిగా ప్రిలిమ్స్, మెయిన్స్, మౌఖిక పరీక్షల ద్వారానే భర్తీ చేస్తారు. ఒకే పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టినప్పుడు అభ్యర్థుల్లో పట్టుదల కనిపించడం లేదని, దరఖాస్తు చేసి పరీక్షలు రాయడం లేదని ఏపీపీఎస్సీ గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. దండు కదులుతోంది
వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండుచేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన అంతకంతకూ ఉద్ధృతమవుతోంది. గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించడానికి వివిధ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని వైపు భారీగా ట్రాక్టర్లు కదులుతున్నాయి. ఇంకోవైపు రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబయిలో సోమవారం భారీ ఊరేగింపు, బహిరంగ సభ జరగనున్నాయి. ఇందుకోసం నాసిక్ నుంచి రైతులు దండులా కదిలి వస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. తూర్పు లద్దాఖ్‌లో చైనా వంచన!
చైనా మరోసారి వంచనకు పాల్పడింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి స్వయంగా ప్రతిపాదించిన ఒక సూచనను తానే ఉల్లంఘించింది. ఆ ప్రాంతంలో తన మోహరింపులను పెంచింది. ఘర్షణలకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతాల్లో తన స్థితిని మరింత పటిష్ఠం చేసుకుంది. దీంతో భారత్ కూడా దీటుగా ప్రతిస్పందిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడటంతో కొద్ది నెలల కిందట రెండు దేశాలూ అక్కడికి భారీగా బలగాలను తరలించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. దుస్తుల మీద నుంచి తాకితే.. లైంగిక వేధింపులు కాదు
లైంగిక వేధింపులకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చను రేకెత్తిస్తోంది. ‘పోక్సో’ చట్టం(లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కనిపెంచిన చేతులే.. కాటేశాయి
కనిపెంచిన చేతులే కాటేసిన దారుణమిది... క్షుద్రపూజలు చేసి ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులే కొట్టి చంపేసిన ఘోరమిది.. విద్యాబుద్ధులు చెప్పి ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన దంపతులు సొంతబిడ్డలను చేతులారా కడతేర్చిన వైనమిది.. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఆదివారం రాత్రి వెలుగు చూసిన ఈ దారుణానికి సంబంధించి పోలీసుల చెప్పిన వివరాలివి.. శివనగర్‌కు చెందిన ఎన్.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
7. ఇన్వెస్టర్లూ పారాహుషార్
ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను స్టాక్‌మార్కెట్లు ప్రతిఫలిస్తాయి. పతనం, వృద్ధి ఏదైనా.. మార్కెట్లు ముందే స్పందిస్తాయి. ఆర్థికాభివృద్ధి వచ్చే ఏడాది నుంచి బాగుంటుందంటే, ఇప్పటి నుంచే పెరుగుతాయి. ఇప్పుడు జరుగుతోంది అదే. దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్-19 ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో సాధించిన 4.18 శాతం వృద్ధి రేటే తక్కువనుకుంటే, కరోనా మహమ్మారి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి లేకపోగా, క్షీణతను నమోదు చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆమె కవిత అక్కడ మారుమోగింది!
అమెరికా దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకార సమయమది.. అక్కడ హాజరైన అతి తక్కువమందిలో 22 ఏళ్ల అమందాగోర్మాన్ ఒకరు. అంతవరకూ ఆమె గురించి కవిత్వ ప్రియులకు మాత్రమే తెలుసు.. కానీ ఆ సభలో ఆమె చెప్పిన కవిత.. బైడెన్, కమలాహ్యారిస్ సహా ప్రపంచాన్నంతా ఫిదా చేసింది. దేశాధినేతలు, ప్రముఖులెందరో ఆసీనులై ఉండగా, వేదికపై తన కవిత్వంతో అందరినీ ఉద్విగ్నతకులోను చేసిందో యువతి. యువత భావోద్వేగాలకు ప్రతిరూపంగా నిలిచి, ప్రజల ఆకాంక్షలను అక్షరాలుగా మలిచి చెప్పిన కవిత్వానికి అక్కడున్నవారందరూ ముగ్ధులయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మళ్లీ జయభేరి మోగిస్తున్నా
మాగంటి మురళీమోహన్... తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవమున్న సీనియర్ నటులు. నిర్మాత. వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ‘జగమే మాయ’ చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేసి ఎన్నో రకాలైన పాత్రలకు జీవం పోశారు. రాజమహేంద్రవరానికి ఎంపీగా పనిచేశారు. 10ఏళ్లుగా సినిమా రంగానికి దూరంగా ఉన్న మురళీమోహన్.. మళ్లీ దృష్టి సారించారు. రాజకీయాలకు పూర్తిగా స్వస్థి పలికి తన సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్‌లో సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా 2021లో కొత్త ప్రయాణంపై మురళీమోహన్ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. యువ హవా
అనూహ్యంగా అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఆ భారత యువ ఆటగాళ్లు.. ఆస్ట్రేలియాలో చారిత్రక విజయంలో భాగస్వాములయ్యారు. అరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శనతో సత్తా చాటారు. భారత జట్టు భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నారు. వాళ్లే కంగారూ జట్టుతో చివరి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన పేసర్ నటరాజన్, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్. ఒకే పర్యటనలో అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన నటరాజన్.. అలా జరుగుతుందని ఊహించలేదంటున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి