
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. పాత కారు ఇస్తే రాయితీ
కొత్త కారు కొనుక్కోవాలనుకునేవారికి శుభవార్త. వాహన తుక్కు విధానం కింద పాతది ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం వెల్లడించారు. 2021-22 బడ్జెట్లో స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి విదితమే. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల కాలం గడిచాక తప్పనిసరిగా దారుఢ్య (ఫిట్నెస్) పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని అప్పుడు పేర్కొన్నారు. ‘యజమానులు పాత వాహనాలు వదిలించుకునేందుకు ప్రోత్సహించేలా, కొత్తవాటి కొనుగోలుపై 5 శాతం రాయితీని తయారీసంస్థలు అందిస్తాయి’ అని మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మృగాళ్లదాడిలో మూడుసార్లు తల్లయ్యింది!
అమ్మానాన్నా మృతి చెందారు.. తోడబుట్టిన అన్న తనదారి తను చూసుకున్నాడు.. ఆసరా లేని స్థితిలో ఆమె మతిస్థిమితం కోల్పోయింది. బిచ్చమెత్తుతూ రోడ్లపైనే సంచరించేది. అలాంటి మహిళను ఆదుకోవాల్సిన సమాజం వక్రబుద్ధి చూపింది. కొందరు మృగాళ్లు లైంగికదాడులు చేయడంతో అభాగ్యురాలు ఇప్పటికి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇంత జరుగుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారు. నిందితులెవరో గుర్తించే ప్రయత్నం లేదు. బాధితురాలిని ఆదుకోనూలేదు. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన ఆ మహిళ ఆదివారం మూడోబిడ్డను ప్రసవించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఛాతీనొప్పితో ఆస్పత్రికి గుత్తా
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం రాత్రి నల్గొండలోని స్వగృహంలో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఛాతీలో నొప్పి ఉందని కుటుంబ సభ్యులకు గుత్తా తెలిపారు. వెంటనే వారు అంబులెన్స్‌లో హుటాహుటిన హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రెండు చోట్ల రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. చికిత్స నిర్వహించి రెండు స్టెంట్లు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4.గృహిణులకు నెలకు రూ.వెయ్యి!
తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్ కార్డులో కుటుంబ పెద్దగా పేర్కొన్న గృహిణులకు ప్రతి నెలా రూ.వెయ్యి ఆర్థికసాయం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు తిరుచ్చి జిల్లా సిరుగనూర్‌లో పార్టీ బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘స్టాలిన్ 7 ఉరుదిమొళిగళ్’ (స్టాలిన్ 7 వాగ్దానాలు)ను ఆయన ప్రకటించారు. మెరుగైన తాగునీటి సరఫరా, నీటి వృథా తగ్గింపు, హరిత విస్తీర్ణం 25 శాతానికి పెంపు, రైతు దిగుబడుల పెంపునకు చర్యలు, అందరికీ ఉన్నత విద్య, ఉన్నతస్థాయి వైద్యం, సుందర మహానగరాల రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. చంద్రబాబు సంగతి అసెంబ్లీలో చూస్తా: మంత్రి కొడాలి
తాను పేకాట క్లబ్బులు నిర్వహించానని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి అంటే ఆయన సంగతి అసెంబ్లీలో చూస్తానని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘చంద్రబాబు అమరావతి పేరుతో కోట్లు దోచుకున్నారు. అక్రమాలపై కేసులు పెడితే న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారు. వాటిని ఎత్తివేస్తే 24 గంటల్లో ఆయన్ను అరెస్టు చేయకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా. నేను పేకాట క్లబ్బులు నిర్వహించానని ప్రతిపక్ష నేత నమ్మితే.. గుడివాడలో నాపై పోటీ చేయాలి. ఎవరేంటో ప్రజలే తేలుస్తారు. ఆయనకు ధైర్యం ఉంటే గుడివాడకు రావాలి. అక్కడే తేల్చుకుంటాం’ అని సవాల్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. భైంసాలో చెలరేగిన అల్లర్లు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇందులో ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వారున్నారు. వీరిలో కొందరిని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తుండగా.. తీవ్రంగా గాయపడ్డ మరికొందరిని నిజామాబాద్‌కు, హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఇక్వెటోరియల్ గినియాలో భారీ పేలుళ్లు!
7. చెరువుల్లో అనకొండలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం లింగం (కట్టమైసమ్మ) చెరువు విస్తీర్ణం 15.40 ఎకరాలు. దీని కింద పాతిక ఎకరాలకు పైగా ఇనాం భూములు సాగులో ఉండేవి. ఇప్పుడు అవెక్కడా కనిపించవు. చెరువుకున్న రెండు తూములు మూసేసి భవనాలు నిర్మించారు. కట్టపైనే నిర్మాణాలు చేపట్టారు. అలుగు, కాల్వలను మళ్లించారు. దీని కింద నాలుగు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. చెరువు కట్టపై చేపట్టిన నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. తెలంగాణలో కొత్తగా 111 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 19,929 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,00,011కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1642కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 189 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,96,562కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* కట్ట చిన్నది.. కొత్తిమీర గొప్పది
9. రాజకీయాల్లో ఆమె ముద్ర
నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన, చేస్తున్న కొందరు మహిళలపై ప్రత్యేక కథనం. తమిళనాడు రాజకీయాల ప్రస్తావన వస్తే ముందుగా జయలలిత గురించే చర్చించుకోవాలి. ఆమె రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనూ తన బలం చాటుకొన్నారు. దక్షిణాది ఉక్కు మహిళగా పేరు గాంచారు. ఎంజీఆర్ ఆహ్వానం మేరకు రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయ రంగంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు, అవమానాలు అనేకం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఐపీఎల్ 2021 భారత్‌లో.. అంతా బయటే
రెండేళ్ల తర్వాత తిరిగి భారత్‌లో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. వచ్చే నెల 9న 14వ సీజన్‌కు తెర లేవనుంది. మే 30న ఫైనల్ జరగనుంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతుందనుకున్న హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. కరోనా నేపథ్యంలో తొలి దశ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించట్లేదు. ఆరు వేదికల్లో జరిగే ఈ సీజన్లో ఏ జట్టుకూ సొంతగడ్డపై మ్యాచ్ ఆడే అవకాశం లేకపోవడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలో పోరుతో సీజన్ షురూ కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి