close

తాజా వార్తలు

Published : 11/01/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఎన్నికల పంచాయితీ: డివిజన్‌ బెంచ్‌కు ఎస్‌ఈసీ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ వెలురించిన నిర్ణయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. డివిజన్‌ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. సంక్రాంతి నేపథ్యంలో వరుస సెలవులున్నందున అత్యవసర పిటిషన్‌గా భావించి విచారించాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది డివిజన్‌ బెంచ్‌ను కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీకి రావాల్సిన నిధులు ఇవ్వండి: బుగ్గన

హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయడం ప్రజలు, ఫ్రంట్‌లైన్‌ వారియర్ల విజయమని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. ధర్మాసనం తీర్పుతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న బుగ్గన  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను త్వరగా ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్ ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు

తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో తీపికబురు అందించారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్‌.. తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని సీఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఫ్రంట్‌లైన్ యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే

కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే టీకా పంపిణీ కార్యక్రమం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. అయితే ఈ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.  వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహాలపై నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ సమావేశంలో మోదీ భేటీ అయ్యారు. టీకా పంపిణీ ఏర్పాట్లపై సీఎంలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు కోట్ల టీకాల పంపిణీ తర్వాత మరోసారి సీఎంలతో భేటీ అవుతానని తెలిపారు. తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దామని చెప్పారు. ఇక తొలి దశలో ప్రయివేటు లేదా ప్రభుత్వ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఇస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. తండ్రయిన విరాట్‌ కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విటర్ వేదికగా తెలిపాడు. మా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నాడు.‘‘ఈ రోజు మధ్యాహ్నం మాకు ఆడబిడ్డ జన్మించిన విషయాన్ని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నా’’ అని విరాట్ ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

* ‘ఛీటర్‌ స్మిత్‌’! ఇంకా మారలేదా?

6. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌: రాజమౌళి ప్లాన్‌ ఏంటి?

‘ఇక నుంచి ప్రతి పండగకు మీకో సర్‌ప్రైజ్‌ తప్పకుండా ఉంటుంది’ -కరోనా తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ మొదలైన సందర్భంగా చిత్ర బృందం చెప్పిన మాట ఇది. అన్నట్లుగానే చకచకా షూటింగ్‌ ప్రారంభించి, కొమరం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత పెద్దగా సందడి కనిపించలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులు సంబరపడేలా ఏదైనా విడుదల చేస్తారని భావించినా, ‘ఈ ఏడాది మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాం’ అంటూ శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్‌ను మాత్రం పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం అటు రామ్‌చరణ్‌, ఇటు ఎన్టీఆర్‌ అభిమానులు సంక్రాంతి బహుమతి కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

* టీజర్‌లాగే సినిమా కూడా నచ్చుతుంది

7. బర్డ్‌ఫ్లూపై అసత్యాలను ప్రచారం చేయకండి

 దేశంలోని పలు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తున్న ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)పై ప్రజలు అసత్యాలను ప్రచారం చేయొద్దని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్ కోరారు. ఈ వైరస్‌ వల్ల మానవులకు ఏ విధమైన హాని జరగదన్నారు. పౌల్ట్రీ పదార్ధాలు బాగా ఉడికించి తినాలని ఆయన సూచించారు. ‘‘ బర్డ్‌ఫ్లూ గురించి ప్రజలంతా భయపడుతున్న సమయంలో వదంతులను వ్యాప్తి చేయొద్దు. 2006 నుంచి అప్పుడప్పుడు బర్డ్‌ఫ్లూ కేసులు వస్తూనే ఉన్నాయి. దీని వల్ల మనుషులకు ఏ విధమైన ముప్పులేదు.’’ అని  తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. చైనాలో 5మాసాల తర్వాత అత్యధిక కేసులు!

కరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనాలో దాదాపు ఐదు నెలల తర్వాత అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 103 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో చివరిగా గతేడాది జులై 30న అత్యధికంగా 127 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం చైనాలోని పలు ప్రావిన్సుల్లో కొత్తగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుండటంతో అధికారులు వేగంగా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే హీలోంగ్జియాంగ్‌ ప్రావిన్సులో కొత్తగా కరోనా వైరస్‌ కేసులు నమోదు కావడంతో సోమవారం లాక్‌డౌన్‌ విధించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. స్పుత్నిక్‌ టీకా ఎంతమంది తీసుకున్నారంటే..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1.5 మిలియన్ల ప్రజలకు స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ అందించినట్లు రష్యా సోమవారం ప్రకటించింది. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు ఆర్థిక సహకారాన్ని అందించిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్డీఐఎఫ్) దీనిని ధ్రువీకరించింది. టీకా తీసుకున్నవారిలో రష్యాకు చెందినవారు ఎందరో, మిగతా దేశాలకు చెందిన వారు ఎందరో చెప్పలేమని ఆర్డీఐఎఫ్‌ ప్రతినిధి ఆర్న్సీ పాలాగిన్‌ తెలిపారు. సంబంధిత దేశాలు విడిగా ఈ సమాచారాన్ని అందిస్తాయన్నారు. గతేడాది ఆగస్టులో రష్యా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన మొదటిదేశంగా నిలిచింది. తర్వాత వెంటనే బిలియన్‌కు పైగా ఆర్డర్లు పొందినట్లు రష్యా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఆప్‌ ఎమ్మెల్యేపై ఇంక్‌తో దాడి.. ఆపై అరెస్ట్!

దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతిపై దాడి యూపీలో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు రాయ్‌బరేలీలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు వస్తున్న ఆయన ముఖంపై ఓ వ్యక్తి సిరాతో చల్లాడు. మరోవైపు, ఈ ఘటన అనంతరం పోలీసులు సోమనాథ్‌ భారతిని అరెస్టు చేశారు. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేలా వ్యవహరించినందుకుగాను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆయన్ను అమేఠీకి తరలించారు. ఆయనపై జరిగిన సిరా దాడి ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని