close

తాజా వార్తలు

Published : 12/01/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. రెండు టీకాలూ సురక్షితమైనవే..!

స్వదేశంలో అభివృద్ది చేసిన రెండు వ్యాక్సిన్‌లూ సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లు అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డాయని, మరో నాలుగు వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. జైడస్‌ క్యాడిలా, స్పుత్నిక్‌-వి, బయోలాజికల్‌-ఇ, జెన్నోవా సంస్థలు కూడా తుదిదశ ప్రయోగాలను కొనసాగిస్తుండగా.. మరికొద్ది రోజుల్లోనే వీటిని కూడా అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. టీకాలపై ప్రజలకు ఎటువంటి సందేహాలు లేకుండా, స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రెండు మోతాదుల్లో టీకాలు తీసుకున్న రెండు వారాల వరకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎస్‌ఈసీ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీలు కోసం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌.. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 8న షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే  ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను నిర్వహించలేమని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ, ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో, ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్‌ కష్టమవుతుందని ఏజీ కోర్టుకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* జగతి పబ్లికేషన్స్‌ కేసు విచారణ 19కి వాయిదా

3. బర్డ్‌ఫ్లూపై భయం వద్దు: ఈటల

బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన పని లేదని, దీనివల్ల ఇప్పటివరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి ఈటల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. అపోహల వల్ల పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బర్డ్ ఫ్లూ వ్యాధి సన్నద్ధతపై వివిధ శాఖల అధికారులు, పౌల్ట్రీరంగ ప్రతినిధులతో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఈటల రాజేందర్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని: సజ్జల

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్ఈసీ) ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్‌ వెనక దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే హైకోర్టు తగిన తీర్పునిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి రావడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఎన్నికల సంఘం కార్యకలాపాలకు పథకం ప్రకారం విఘాతం కలిగించారన్న అభియోగాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు(జేడీ) జీవీ సాయిప్రసాద్‌ను, తాజాగా ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీ మోహన్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తొలగించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏపీలో కొత్తగా 197 కరోనా కేసులు

5. 25నాటికి సిద్ధంగా ఉండాలి: సబితా ఇంద్రారెడ్డి

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈనెల 25 నాటికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖల కమిషనర్ ననీన్ మిత్తల్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. తొమ్మిది, పది, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 20లోగా నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వైద్యనిపుణులతో చర్చించి నిర్ణయిస్తాం: సుప్రీంకోర్టు

కోర్టులను పూర్తిస్థాయిలో తెరవాలన్న అంశంపై వైద్యనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది. ఏడాది కాలంగా న్యాయస్థానాల్లో జరగాల్సిన వాదనలు, విచారణలు అన్నీ వీడియో కాన్ఫరెన్సుల్లోనే జరుగుతున్నాయి. ఈ విధంగా వాదనలు వినిపించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై వైద్యనిపుణుల సలహా కీలకమని వ్యాఖ్యానించింది. కరోనా సంక్షోభంలోనూ కోర్టులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కోర్టులను తెరచినా కరోనా కారణంగా న్యాయవాదులు హాజరు కావట్లేదని ధర్మాసనం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బాబోయ్‌.. టీమిండియా పరిస్థితేంటి?

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రత్యర్థి జట్టు కంటే గాయాలతోనే తీవ్ర పోరాటం చేస్తోంది. ఇది కాస్త అతియోశక్తి అనిపించినా, కాదనలేని వాస్తవం! ఒకరా, ఇద్దరా.. జట్టు ఎంపిక నుంచి ఇప్పటివరకు 13 మంది ఆటగాళ్లు గాయపడ్డారు. అయినా కంగారూలకు భారత్‌ ముచ్చెమటలు పట్టించడం అభినందనీయం. అయితే బ్రిస్బేన్‌ వేదికగా జరిగే ఆఖరి టెస్టుకు గాయంతో బుమ్రా కూడా దూరమవుతున్నాడని ప్రకటించడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. తుదిజట్టును ఎలా ఎంపికచేయాలో తెలియక జట్టు యాజమాన్యం తల పట్టుకుంటోంది. రిజర్వ్‌ బెంచ్ బలంగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. కానీ సీనియర్లు లేని లోటుని జూనియర్లు భర్తీ చేయగలరా అనేది ప్రశ్న. అంతేగాక గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఎలా పోరాడుతుందనేది ఆసక్తికరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* మన క్రికెటర్లకి.. అంతా బంగారు తల్లులే 

8. కేంద్ర బడ్జెట్‌: వైద్యరంగానికి ప్రత్యేక నిధి ఏర్పాటు!

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి..వైద్య రంగంలోని లోటుపాట్లను ఎత్తిచూపింది. ఈ  పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రానున్న వార్షిక బడ్జెట్‌లో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైద్యరంగానికి విడిగా నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. దానిని ప్రధానమంత్రి స్వాస్థ్‌ సంవర్ధన్ నిధి పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. వైద్యరంగంలో ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొని, నిలబడేందుకు బడ్జెట్ కేటాయింపులకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. సోనియాజీ పాత ప్రసంగాలు గుర్తుతెచ్చుకోండి!

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఎప్పుడూ రైతుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గతంలో తాము ఇచ్చిన ప్రసంగాలను మరోసారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన విమర్శలు చేశారు. ఇప్పుడు కావాలని  చట్టాలకు వ్యతిరేకంగా రైతుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఠాకూర్‌ మంగళవారం ఓ సమావేశంలో వెల్లడించారు. ‘వ్యవసాయరంగంలో సంస్కరణల విషయమై గతంలో తాము చేసిన ప్రసంగాల్ని మరోసారి గుర్తుకుతెచ్చుకోవాలని సోనియగాంధీని కోరుతున్నాం. గతంలో వారే ఈ వ్యవసాయ చట్టాలు తీసుకురావాలని అన్నారు. కానీ అమలు చేయలేకపోయారు. మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోంది. పీఎం కిసాన్‌ యోజన, నీటిపారుదలకు సంబంధించి ఎన్నో సానుకూల నిర్ణయాలు తీసుకుంది’ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన పంత్‌

భారత్×ఆస్ట్రేలియా మూడో టెస్టు ముగిసిన నేపథ్యంలో ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. సిడ్నీ టెస్టులో 131, 81 పరుగులతో సత్తాచాటిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (900) తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని రెండో స్థానంలో నిలిచాడు. పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లిన విరాట్ కోహ్లీ ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానంలో (870) ఉన్నాడు. మరోవైపు పాకిస్థాన్‌ సిరీస్‌లో పరుగుల వరద పారించిన న్యూజిలాండ్ సారథి కేన్‌ విలియమ్సన్‌ (919) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని