close

తాజా వార్తలు

Updated : 13/01/2021 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. వస్తున్నాయ్‌.. 83 తేజస్‌లు..! 

భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మన వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ (ఎల్‌సీఏ - లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు ఆమోద ముద్రవేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు తీసుకున్న నిర్ణయం దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌ టీకాకే మా ఓటు.. కొన్నాళ్లు ఆగుతాం

మరి కొన్ని గంటల్లో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలకు వ్యాక్సిన్లు చేరుకున్నాయి. మరి ఇంతకీ ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అసలు వ్యాక్సిన్‌పై వారి అభిప్రాయాలేంటి? వీటిపై యూజీవోవీ అనే సంస్థ ఒక సర్వేని నిర్వహించింది. ఈ సర్వేలో పలు కీలక అంశాలు వెలువడ్డాయి. ఎక్కువశాతం (68%) ప్రజలు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 24శాతం మంది వ్యాక్సిన్‌పై ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని తెలుపగా, 8శాతం ప్రజలు మాత్రం తాము వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు సిద్ధంగాలేమని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముగిసిన అఖిలప్రియ మూడో రోజు కస్టడీ

ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం ఆమెను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఈలోపు ఆమె నుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొదట పోలీసులు అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణిని అవలంబించిన అఖిలప్రియ, ఆ తర్వాత కొన్నింటికి సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* దా‘రుణ’ యాప్‌లు: 90శాతం వారివే!

4. అప్పులు చేసింది అభివృద్ధి కోసమే: బొత్స

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అభివృద్ధి కోసమే కానీ అవినీతి చేయడం కోసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పారదర్శకత కోసమే కొత్త మున్సిపల్‌ పన్నుల విధానాన్ని తీసుకొచ్చామన్నారు. విజయనగరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు శాపనార్థాలే తమకు దీవెనలని బొత్స అన్నారు. ఆయన చేసిన తప్పులపై పశ్చాత్తాపం పడకుండా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇష్టారీతిన పన్నులు వేస్తూ ప్రజలను బాధిస్తున్నామని చంద్రబాబు చేసిన విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రంలోని ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏపీలో కొత్తగా 203 కరోనా కేసులు

5. సంక్రాంతి సంబరాలు: కొత్త పోస్టర్ల కళకళలు

సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంట్లో రంగు రంగుల ముగ్గులు, కొత్త అల్లుళ్ల సందడి, బంధువుల పలకరింపులతో సందడిగా మారింది. మరోవైపు కొత్త సినిమాల సందడితో చిత్ర పరిశ్రమ కూడా కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లను ఆయా చిత్ర బృందాలు పంచుకున్నాయి. రానా-సాయి పల్లవి ‘విరాట్‌ పర్వం, రవితేజ ‘ఖిలాడి’, వెంకటేశ్‌-వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్‌3’, అఖిల్‌-పూజాహెగ్డేల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాల కొత్త పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో విడుదలయ్యాయి. మరి పతంగుల పండగ రోజున వచ్చిన సినీ పతంగులేవో చూసేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* భోగిపళ్లు కావాలా.. అక్కడికెళ్లాల్సిందే మరి!

6. కరోనాకు ఇన్‌హేలర్‌ ఆధారిత చికిత్స

కొవిడ్‌-19 బాధితులు త్వరగా కోలుకొనేందుకు బ్రిటన్‌లోని సినైర్‌జెన్స్‌ సంస్థ ఇన్‌హేలర్‌ ఆధారిత చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ఏదైనా వైరస్‌ సోకినప్పుడు శరీరంలో ఇంటర్‌ ఫెరాన్‌ బీటా-1ఏ (ఎస్‌ఎన్‌జీ001) అనే ప్రొటీన్‌ కణాలు విడుదల అవుతాయి. వైరస్‌లను నిలువరిస్తాయి. ఈ ఇన్‌హేలర్‌నూ ఎస్‌ఎన్‌జీ001తోనే రూపొందిస్తుండటం గమనార్హం. ఆక్సిజన్‌ అవసరమైన 20 దేశాల్లోని 610 మంది కరోనా బాధితులు ట్రయల్స్‌ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా: సత్తాగల కొత్త యాంటీబాడీలు గుర్తింపు

7. జేఈఈ విద్యార్థుల కోసం అమెజాన్‌ అకాడమీ

ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌.. జేఈఈకి సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. అమెజాన్ అకాడమీ పేరిట ప్రారంభించిన ఈ వేదిక ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు, స్టడీ మెటీరియల్స్‌ అందించనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా గణితం, రసాయనం, భౌతికశాస్త్రంపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించనున్నామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 8. డిజిటల్‌ రుణాలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న డిజిటల్‌ రుణాల దారుణాలను నివారించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. దీనిపై అధ్యయనం చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. రుణ యాప్‌లు, ఇతర డిజిటల్‌ రుణాలను ఈ  గ్రూప్‌ పరిశీలిస్తుంది. అంతేకాకుండా, డిజిటల్‌ రుణాల లోటుపాట్లపై కూడా అధ్యయనం చేస్తుంది. ‘‘ఆర్థికరంగంలో వివిధ డిజిటల్‌ పద్ధతుల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడమనేది స్వాగతించదగినది. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆయనకెంతో రుణపడి ఉన్నా..: త్రివిక్రమ్‌

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. రచయితగా మాటలతో మాయచేస్తారు.. దర్శకుడిగా సినిమాలతో మైమరిపిస్తారు. కేవలం హీరోలను చూసే థియేటర్లకు వెళ్లే రోజుల్లో డైరెక్టర్లను చూసి కూడా సినిమాలకు వెళ్లొచ్చన్న ఆలోచన పుట్టించారు. ‘స్వయంవరంతో’ మొదలై ‘అలవైకుంఠపురములో’ వరకూ సాగిన.. సాగుతున్న ఆయన ప్రయాణంలో హిట్టు సినిమాల గురించి చెప్పాలంటే చాలా సినిమాలు క్యూలో నిల్చుంటాయి. అయితే.. ఎంత ఎదిగినా మూలాలను మరిచిపోవద్దనే సూక్తిని నమ్ముతారాయన. అందుకే.. తన కెరీర్‌ ప్రారంభంలో ఆయనకు అండగా నిలిచిన నిర్మాత స్రవంతి రవికిషోర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సిరాజ్ ‘ట్రెండ్’ సెట్ చేశాడు!

క్రికెట్‌లో జాత్యహంకారానికి చోటు లేదని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ లైయన్ అన్నాడు. సిడ్నీ టెస్టులో టీమిండియా యువపేసర్ మహ్మద్‌ సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ అధికారులకు సిరాజ్‌ ఫిర్యాదు చేయగా ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపించింది. ఈ నేపథ్యంలో జాతివివక్షపై లైయన్ మాట్లాడాడు. క్రికెట్‌లో సిరాజ్‌ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడని తెలిపాడు. వివక్షకు గురైతే ఆటను నిలిపివేసి, ఆకతాయిల్ని స్టేడియం బయటకి పంపించే అవకాశం ఆటగాళ్లకు ఉందని అతడు‌ తెలియజేశాడని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వావ్‌ కుల్‌దీప్‌... షాక్‌ అయిన గిల్‌Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని