close

తాజా వార్తలు

Published : 21/01/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: ఆరుగురి మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్‌తో పాటు ఐదుగురు మహిళలు మరణించారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారిగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

పంచాయతీ ఎన్నికల అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం అందులో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఈరోజు ఉదయం కీలక తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై ధర్మాసనం ఎదుట రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్‌ రిజర్వ్‌ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే స్వీప్‌ చేస్తాం’

3. TS: ఈడబ్ల్యూఎస్‌ కోటాపై కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు అమలు చేసే రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే అదనంగా ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం అమలు చేస్తున్నామని.. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి రిజర్వేషన్లు 60 శాతానికి పెరగనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌ను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది: షా

కరోనా కాలంలో ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక స్థితి నుంచి భారత్‌ కోలుకున్న విధానం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. గురువారం గుజరాత్‌లోని షిలాజ్‌లో నాలుగులైన్ల ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అమిత్‌ షా వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ‘‘ కరోనాతో ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులయ్యాయి. కానీ భారత్‌ ‘వి’ఆకారపు ఆర్థిక వృద్ధి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. గతేడాది జూన్‌లో లాక్‌డౌన్‌ కారణంగా భారత జీడీపీ 23.9శాతం క్షీణించింది. సెప్టెంబరు నాటికి ఈ క్షీణత 7.5శాతానికి చేరింది. అప్పటికి అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ సమయాల్లో చెల్లింపులు చేయకండి

రానున్న కొద్ది రోజుల్లో యూపీఐ ఫ్లాట్‌ఫాంను అప్‌గ్రేడ్‌ చేయనున్న నేపథ్యంలో వినియోగదారులకు నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) సూచనలిచ్చింది. ఈ మేరకు ఎన్పీసీఐ గురువారం ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. ‘‘యూపీఐ చెల్లింపుల్లో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా కొద్ది రోజుల పాటు అర్ధరాత్రి ఒంటిగంట నుంచి 3గంటల మధ్య ప్రాంతంలో యూపీఐను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. దీని వల్ల వినియోగదారులకు కొద్ది రోజుల పాటు అసౌకర్యం తలెత్తవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Day 4: భారీగా పెరిగిన బంగారం ధర

* నియర్‌బై షేర్ తరహా..గూగుల్ కొత్త ఫీచర్‌

6. అనుకున్న దారిలోనే ర్యాలీ: రైతు సంఘాలు

గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ల ర్యాలీ అనుమతిపై పూర్తి అధికారాలు దిల్లీ పోలీసులవే అని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సింఘు సరిహద్దుకు సమీపంలోని ఓ రిసార్టులో రైతు సంఘాల ప్రతినిధులు, పోలీసులు మరోసారి చర్చలు జరిపారు. దిల్లీ పోలీసులు ట్రాక్టర్ల ర్యాలీని కుండ్లి-మనేసర్-పాల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్వహించాలని పోలీసులు సూచిస్తుండగా, ముందు అనుకున్న విధంగానే దిల్లీ ఔటర్‌ రింగురోడ్డుపైనే ర్యాలీని నిర్వహిస్తామని రైతు సంఘాలు పట్టబట్టుతున్నాయి. సమావేశం అనంతరం స్వరాజ్‌ అభియాన్‌ నాయకుడు యోగేంద్ర యాదవ్‌ పాత్రికేయులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సంప్రదింపులు ప్రారంభించిన సుప్రీం నిపుణుల కమిటీ!

* పేరు చెబుతున్నా.. కేసు పెట్టుకోండి: సువేందు

7. రామ మందిరానికి గంభీర్‌ భారీ విరాళం 

అయోధ్య రామమందిరం నిర్మాణానికి మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతం గంభీర్‌ భారీ విరాళం ఇచ్చారు. తన వంతుగా రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి తాను, తన కుటుంబం తరఫున ఈ విరాళం అందజేసినట్టు ఆయన వెల్లడించారు. యూపీలోని అయోధ్య నగరంలో అద్భుతమైన రామమందిర నిర్మాణం భారతీయులందరి కల అన్నారు. దీనిపై సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు తెరపడటంతో ఐక్యత, ప్రశాంతతకు మార్గం సుగమైందని తెలిపారు. ఇందులో తమ వంతుగా చిన్న సాయం అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్యాంక్ పేరుతో వ‌చ్చే ఫేక్ మెసేజ్‌ల‌ను గుర్తించ‌డం ఎలా?

బ్యాంకులు వివిధ మీడియా ఛాన‌ళ్ల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ బ్యాంకింగ్ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి మోసాలను గురించి ఖాతాదారులు తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం, ఖాతాదారుడు శ్ర‌ద్ధ‌గా, అవ‌గాహ‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తే బ్యాంకింగ్ మోసాల‌ను చాలా వ‌ర‌కు నివారించ‌వ‌చ్చ‌ని బ్యాంకింగ్ ప‌రిశ్ర‌మ నిపుణులు చెబుతున్నారు.  ఈ ర‌క‌మైన మోసాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ త‌మ ఖాతాదారుల‌కు మూడు చిట్కాల‌తో కూడిన మెయిల్‌ను పంపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టీమ్‌ఇండియా.. క్వారంటైన్‌కు ఆ ఐదుగురు

ఆస్ట్రేలియాలో అదరగొట్టిన టీమ్‌ఇండియా క్రికెటర్లు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లో దిగారు. అక్కడి విమానాశ్రయాలకు చేరుకున్న అభిమానులు క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ.. డప్పులు వాయిస్తూ.. వీర తిలకం దిద్దారు. ఇక సారథ్యం వహించిన అజింక్య రహానెకైతే ఊహించని రీతిలో స్వాగతం లభించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* విశ్రమించను.. విజయం తలకెక్కించుకోను: సిరాజ్‌

10. ‘సీరమ్‌’ అగ్నిప్రమాదంలో ఐదుగురి మృతి 

ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ)కు చెందిన కొత్త ప్లాంట్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం విషాదం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న ఎస్‌ఈజెడ్‌- 3 భవనంలోని నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో పొగలు అలముకున్నాయి. దీంతో అక్కడి ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లను రంగంలోకి దించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని