close

తాజా వార్తలు

Published : 03/03/2021 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. సంజయ్‌..ఐటీఐఆర్‌ తెచ్చే దమ్ముందా?: కేటీఆర్‌

రాష్ట్రానికి ఐటీఐఆర్‌ తేలేని భాజపా.. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్‌ను మూలకు పెట్టింది భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పలుమార్లు పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఐటీఐఆర్ గురించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ ఓ అబద్ధాల జాతరగా కేటీఆర్‌ అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై గంటా స్పందన

తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గంటా పార్టీ మారే అవకాశముందటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. విజయసాయి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో ఆయన చెప్పాలని గంటా డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పలమనేరులో తెదేపా, వైకాపా తోపులాట

3. ‘కొవాగ్జిన్’‌ క్లినికల్‌ సామర్థ్యం 81%

కరోనా నిరోధక టీకా కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రకటించింది. వైరస్‌ నివారించడంలో తాము అభివృద్ధి చేసిన టీకా మధ్యంతర క్లినికల్‌ సామర్థ్యం 81శాతంగా ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. సుమారు 25,800 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించినట్టు భారత్‌ బయోటెక్‌ స్పష్టంచేసింది. ఈ దశలో ఫలితాలు గతంతో పోలిస్తే మెరుగైనట్టు తెలిపింది. దేశంలో అత్యవసర వినియోగం కింద ఇప్పటికే కొవాగ్జిన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రతిభావంతులకు మెండుగా అవకాశాలు: మోదీ

దేశంలో ప్రతిభ కలిగిన యువతకు చాలా రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విద్యారంగంలో బడ్జెట్‌ కేటాయింపుల అమలు అంశంపై బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. ‘కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యం తర్వాత విద్య, నైపుణ్యాలు, పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి రంగాలపైనే ఎక్కువగా దృష్టి సారించాము. అంతేకాకుండా విద్యను ఉపాధి మార్గాలతో అనుసంధానం చేయడానికి మేం చేస్తున్న ప్రయత్నాలను బడ్జెట్‌ మరింత విస్తృతం చేస్తోంది’’ అని మోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రానా ‘అరణ్య’ ట్రైలర్‌ వచ్చేసింది..

సినిమా.. సినిమాకు కొత్తదనం చూపించే నటుడు రానా. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొంటూ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. ఈసారి ఓ సరికొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరణ్య’. ఏనుగుల అవసరాలు, మనుషుల దురాశకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. విజయనగరం విద్యార్థినిదీ కట్టుకథే..

విజయనగరం జిల్లాలో గుర్ల వద్ద ఓ డిగ్రీ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసినట్లుగా నమోదైన కేసులో మిస్టరీ వీడింది. తన కుటుంబసభ్యులను నమ్మించేందుకు ఆ విద్యార్థిని ‘కట్టు’కథ అల్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్నేహితులతో బయటకు వెళ్లినట్లు ఇంట్లో తెలిసిపోతుందని విద్యార్థిని ఆవిధంగా నాటకమాడింది. కుటుంబసభ్యులను నమ్మించేందుకు తానే కాళ్లు, చేతులు కట్టుకున్నట్లు ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజకుమారి ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కమల్ హాసన్ పోటీ అక్కడినుంచేనా..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మక్కల్‌నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన పోటీ చేయబోయే స్థానం గురించిన సమాచారం ఆసక్తిగా మారింది. గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీఆర్ ప్రాతినిధ్యం వహించిన అలందూర్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. చెన్నైకి సమీపంలోని ఆ ప్రాంతాన్ని పరంగిమలై నియోజవర్గం అని కూడా పిలుస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హెల్మెట్ లేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌కు జరిమానా!

దేశవ్యాప్తంగా నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరిగే ప్రమాదాల్లో శిరస్త్రాణం లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నవారు అనేకం. రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగి వ్యక్తి ప్రాణాలు కోల్పోతే.. అరెరే.. హెల్మెట్‌ ధరించి ఉంటే చనిపోయేవాడు కాదు.. అని అనుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఎంత చెప్పినా ఇప్పటికీ శిరస్త్రాణం లేకుండా రోడ్లపైకి వస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. కానీ, తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. దీంతో అక్కడి పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌పై సైబర్‌ దాడి.. స్పందించిన చైనా!

భారత్‌ వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తోన్న వార్తలపై డ్రాగన్‌ స్పందించింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఔషధ సంస్థలపై చైనా సైబర్‌ దాడులకు పాల్పడిందంటూ సైఫిర్మా అనే అంతర్జాతీయ సంస్థ నివేదికను తోసిపుచ్చింది. టీకా సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా హ్యకర్‌ బృందాలు దాడులు చేస్తున్నాయన్న నివేదికలను తప్పుబట్టింది. ఇక భారత పోర్టులపైనా చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారంటూ రికార్డెడ్ ఫ్యూచర్‌ చేసిన ఆరోపణలను ఖండించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అలా చేస్తే.. టీమ్‌ఇండియాపై ఒత్తిడి!

నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధిస్తే టీమ్‌ఇండియా ఒత్తిడికి గురవుతుందని పర్యాటక జట్టు మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ అభిప్రాయపడ్డాడు. చివరి మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించే అవకాశం ఉందని.. అలా జరగాలంటే తొలి టెస్టులాగే ఇప్పుడు కూడా తొలి ఇన్నింగ్స్‌లో 200 స్కోర్‌ చేయాలని హుసేన్‌ అన్నాడు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని