Top Ten News @ 9 PM

తాజా వార్తలు

Published : 22/06/2021 20:57 IST

Top Ten News @ 9 PM

1. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌, కేరళ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండ్రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేసింది.  ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. 

2. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ .. కృష్ణా బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు లేఖ రాశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే విధించినప్పటికీ  ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాలను కృష్ణా బోర్డు అడ్డుకోలేకపోయిందన్నారు.

పాకిస్థాన్‌లో మ్యాచ్‌..హైదరాబాద్‌లో బెట్టింగ్‌

3. బిల్‌గేట్స్‌ గారాల కూతురి గురించి తెలుసా?

ఫీబీ అడెల్‌ గేట్స్‌.. ఈమె ఎవరు అనుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, మెలిందా గేట్స్‌ గారాల కూతురు. 18 ఏళ్ల ఈ అమ్మాయి సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫొటోలను పంచుకుంటోంది.  గేట్స్‌ దంపతులు తమ విడాకుల గురించి మే 4న ప్రకటించాక అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించినట్లు వారు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గేట్స్‌ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్‌ గేట్స్‌, రోరీ గేట్స్‌, ఫీబీ అడెల్‌ గేట్స్‌. అందరి కంటే చిన్నమ్మాయి ఫీబీ అడెల్‌ గేట్స్. 

4. ప్రమాదంలో యువత భవిష్యత్తు: చంద్రబాబు

పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసమర్థ, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వనందున నిరుద్యోగ యువత భవితవ్యం ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండర్‌ విడుదల చేయటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.

5. ఒకేరోజు 88లక్షల డోసులు.. టాప్‌ 10రాష్ట్రాలివే!

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా దేశంలో టీకా పంపిణీ వేగం పుంజుకుంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 88.09లక్షల డోసులు పంపిణీ చేశారు. 36.32% వ్యాక్సినేషన్‌ పట్టణ ప్రాంతాల్లో జరగ్గా.. 63.68% వ్యాక్సినేషన్‌ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 16న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో డోసుల పంపిణీ జరగలేదు. ఏప్రిల్‌ 1న మాత్రమే 48లక్షల మందికి టీకా వేశారు. 

6. Covid Variant: దేశంలో 22 డెల్టా ప్లస్‌ కేసులు

దేశంలో కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో వేరియంట్‌ కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్‌లో సంభవించిన మ్యుటేషన్‌ కారణంగా పుట్టుకొచ్చిన ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ కేసులు దేశంలో 22 నమోదయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్రలోని రత్నగిరి, జల్‌గావ్‌ ప్రాంతాలతో పాటు కేరళ, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

7. CBSE: మూల్యాంకన ప్రక్రియలో జోక్యం అవసరంలేదు

పన్నెండో తరగతి విద్యార్థుల ఫలితాలను వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ రూపొందించిన మూల్యాంకన విధానం పారదర్శకంగా, సహేతుకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం కన్పించట్లేదన్న న్యాయస్థానం.. బోర్డుల మూల్యాంకన విధానాలను ఆమోదిస్తున్నట్లు వెల్లడించింది. 12వ తరగతి విద్యార్థుల వార్షిక ఫలితాలపై సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులు సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ముందు అఫిడవిట్‌ దాఖలు చేశాయి. 

8. పవార్‌ నివాసంలో ముగిసిన కీలక నేతల భేటీ!

ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ నివాసంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం ముగిసింది. భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించేందుకే ఈ సమావేశం జరుగుతోందన్న ఊహాగానాల మధ్య జరిగిన ఈ భేటీలో ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించినట్టు  యశ్వంత్ సిన్హా వెల్లడించారు. ఇది రాజకీయ సమావేశం కాదని, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల మధ్య ఇంటరాక్షన్‌ అని సీపీఎం నేత నిలోత్పల్‌బసు అన్నారు.

9. Politics: 2019 ఎన్నికల సీన్‌ రిపీట్‌ అయ్యేనా?

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌తోపాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు అధికార భాజపా కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే పలుమార్లు పార్టీ కీలక నేతలంతా సమావేశమై దీనిపై చర్చిస్తున్నారు. మరోవైపు మిత్రపక్ష పార్టీలకు కూడా తగినంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు పోవాలని కాషాయ దళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో జేడీయూకు స్థానం దక్కుతుందా? ఒకవేళ దక్కినా గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ అధినేత నీతీశ్‌కుమార్‌ అందుకు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నా ఎలాంటి షరతులు పెడతారన్నదానిపై సందిగ్ధత  నెలకొంది.

10. Corona: మా దేశంలో ఒక్కకేసు కూడా లేదు..!

ప్రపంచమంతా ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఉత్తరకొరియా దేశంలో ఆ వైరస్ ఆనవాలే లేదట! ఇదే విషయాన్ని ఆ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా వెల్లడించింది. జూన్ 10 నాటికి తమ దేశంలో 30వేలమంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షించినట్లు సంస్థకు నివేదించింది. అయితే ఆ నిర్ధారణ పరీక్షల్లో ఒక్కరికి కూడా కరోనా సోకినట్లు వెల్లడికాలేదని తెలిపింది.

WTC Final: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని