
తాజా వార్తలు
తెలంగాణ సర్వర్లలోకి చైనా ‘థ్రెట్ యాక్టర్’!
సీఈఆర్టీ-ఇన్ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది: ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ
జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ సర్వర్లలోకి చైనాకి చెందిన థ్రెట్ యాక్టర్ హ్యాకింగ్ గ్రూప్ ప్రవేశించి విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాన్ని రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) గుర్తించి రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. భారతదేశ గ్రిడ్ మాత్రమే కాకుండా రాష్ట్ర గ్రిడ్, విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని కొన్ని సబ్ స్టేషన్లకు థ్రెట్ యాక్టర్ ప్రవేశించినట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర విద్యుత్ సాంకేతిక విభాగం వెంటనే అప్రమత్తమై వాటిని ఎక్కడికక్కడ నిరోధించే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గ్రిడ్‌కు సంబంధించిన అధికారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించామని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ తెలిపారు. వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.