
తాజా వార్తలు
ఉత్తరాఖండ్‌లో సీఎం మార్పు?
దిల్లీ: ఉత్తరాఖండ్‌లో నాయకత్వ మార్పు జరగనుందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సోమవారం దిల్లీకి పయనమవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది. కాగా, ‘ఆయన కేంద్రంలోని భాజపా పెద్దలతో సమావేశమయ్యేందుకే దిల్లీ బయలుదేరినట్లు’ సీఎం కార్యాలయం వెల్లడించింది. రావత్ దిల్లీకి బయలుదేరిన కారణమేదైనప్పటికీ.. ప్రస్తుతం పరిణామాలు మాత్రం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ భాజపా శ్రేణుల్లో కొంతకాలంగా రావత్ నాయకత్వం పట్ల అసంతృప్తి నెలకొందనే వార్తలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే అధిష్ఠానం శనివారం రాష్ట్రానికి ఇద్దరు సీనియర్ నాయకులను పంపినట్లు మీడియా వర్గాలు పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఆ ఇద్దరిలో భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్‌సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఉన్నారు. వారు రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమై వివిధ అంశాలపై వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. వారిచ్చే నివేదికల ఆధారంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాల సమాచారం.