3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 20/03/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు.  మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎలక్ట్రానిక్‌ సిస్టమ్ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 60 వేల మందికి దీనికి సంబంధించి శిక్షణ ఇవ్వగా.. 30 వేల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్‌ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 

రాష్ట్రానికి కొత్తగా 40 పరిశ్రమలు వచ్చాయని,  రూ.2 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. విద్యుత్‌ వాహనాల 2020- 30 విధానాలు అవలంబిస్తున్నామని తెలిపిన మంత్రి.. దివిటిపల్లి, చందన్‌వెల్లిలో విద్యుత్‌ వాహనం, ఇంధన నిల్వ వ్యవస్థల అభివృద్ధికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో పరిణామాలు తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం, స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామని కేటీఆర్‌ సభకు వెల్లడించారు. 

టీఎస్‌ బీపాస్‌ ప్రారంభించిన 100 రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శాసనసభలో వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి 600 గజాల వరకు స్వయం దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్ అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ ధ్రువపత్రం సైతం జారీ చేస్తున్నామని తెలిపారు. కేపీహెచ్‌బీలో ఇళ్ల పునర్మిర్మాణానికి ఉచితంగా అనుమతులు కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేయగా.. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

80 శాతం మందికి రేషన్‌కార్డులున్నాయి: మంత్రి గంగుల

రాష్ట్రంలో సుమారు 80 శాతం మందికి రేషన్‌కార్డులున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అసెంబ్లీలో వెల్లడించారు. కొంతకాలంగా రేషన్‌కార్డులు మంజూరు చేయడం లేదని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కరోనా వేళ కొత్త కార్డులు జారీ చేయలేదని, రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని త్వరలోనే అర్హులందరికీ అందిస్తామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సుమారు 2 కోట్ల 79 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని మంత్రి తెలిపారు. 

కరోనా పరీక్షలు చేయించుకోవాలి: సభాపతి

ఎమ్మెల్యేలందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. 
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని