‘హైదరాబాద్’‌ ఎమ్మెల్సీ పోరు.. పీవీ కుమార్తె గెలుపు
close

తాజా వార్తలు

Updated : 21/03/2021 00:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హైదరాబాద్’‌ ఎమ్మెల్సీ పోరు.. పీవీ కుమార్తె గెలుపు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు నాలుగు రోజుల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. నువ్వానేనా అన్నట్టు కొనసాగిన మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఎట్టకేలకు తేలింది. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి రాంచందర్‌రావుపై రెండో ప్రాధాన్యతా ఓటుతో ఆమె విజయ‘వాణి’గా నిలిచారు. సురభి వాణీదేవికి మొత్తంగా 1,89,339 ఓట్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఆమె విజయంపై ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ ఉత్కంఠ పోరులో విజయం సాధించిన సురభి వాణీదేవికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను సన్మానించి మిఠాయిలు తినిపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. 

విజయం ఇలా..

ఈ నెల 14న ఎన్నికలు జరగ్గా.. బుధవారం (ఈ నెల 17న) నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కొనసాగిన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ విజయం దక్కకపోవడంతో మొత్తంగా 91మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వాణీదేవికి తొలి ప్రాధాన్యతగా 1,12,689 ఓట్లు రాగా.. 36,580 రెండో ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఆమె 1,49,269 ఓట్లు సాధించారు. వాణీదేవి గెలుపునకు అవసరమైన కోటా రావాలంటే.. ఇంకా 19,251 ఓట్లు రావాల్సి ఉంది. మరోవైపు, చివరగా మిగిలిన ఇద్దరు అభ్యర్థులకూ కోటాకు అవసరమైన ఓట్లు (1,68,520) రాకపోవడంతో భాజపా అభ్యర్థి రామచంద్రరావు ఎలిమినేషన్‌ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రాంచందర్‌రావుకు తొలి ప్రాధాన్యతగా లభించిన 1,04,668 ఓట్లలో వాణీదేవికి 40,070 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ఆమె 1,89,339 ఓట్లు సాధించారు. విజేత అయ్యేందుకు అవసరమైన కోటా ఓట్లు కన్నా సురభి వాణీదేవి 20,819 ఓట్లు  ఎక్కువ సాధించడం విశేషం. 

రాంచందర్‌రావుకు ఓట్లెన్ని?

మరోవైపు, భాజపా అభ్యర్థి రామచంద్రరావుకు తొలి ప్రాధాన్యత ఓట్లు 1,04,668 ఓట్లు రాగా.. 32898 రెండో ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఆయన 1,37,566 ఓట్లు సాధించారు. ఇదిలా ఉండగా..  భాజపా ఏజెంట్లు, కొందరు ఆ పార్టీ కార్యకర్తలు కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెనుదిరిగినట్టు తెలుస్తోంది. తెరాస శ్రేణులు సరూర్‌నగర్‌ స్టేడియం వద్దకు చేరుకొని సంబురాలు చేసుకున్నారు.

మూడో స్థానంలో కె.నాగేశ్వర్‌

 ఎన్నికల్లో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ 67,383 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. రెండో ప్రాధాన్యత లెక్కింపులో నాగేశ్వర్‌ నుంచి తెరాసకు 21,259 ఓట్లు రాగా.. భాజపాకు 18,368 ఓట్లు బదిలీ అయ్యాయి. తొలి, రెండో ప్రాధాన్యతా ఓట్లలో అన్ని రౌండ్లలోనూ తెరాస ఆధిక్యం కనబరుస్తూ రావడం గమనార్హం.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని