కరోనా పరీక్షల సంఖ్య పెంచాం: సీఎస్‌
close

తాజా వార్తలు

Updated : 13/08/2020 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పరీక్షల సంఖ్య పెంచాం: సీఎస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది. 

హోటళ్లలో ఐసోలేషన్‌ పడకలు 857 నుంచి 2,995కి పెరిగాయని వెల్లడించింది. ‘‘జిల్లాల్లో 86 కొవిడ్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  అడ్మిషన్ల ప్రక్రియ సులభతరమైంది. ప్రైవేటు ఆసుపత్రులపై 50 ఫిర్యాదులు వచ్చాయి. 46 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం. షోకాజ్‌ నోటీసులకు 16 ఆసుపత్రులు వివరణ ఇచ్చాయి. బులిటెన్‌లో గందరగోళం లేకుండా చర్యలు తీసుకున్నాం. కరోనా మృతదేహాల కోసం 61 వాహనాలు ఉన్నాయి’’ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయి...రాష్ట్రంలో రోజుకు 40వేల ర్యాపిడ్‌ టెస్టులు జరిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీలో కరోనా తగ్గుముఖం పడుతోందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సదుపాయం కల్పించామని, హితం యాప్‌ను ఇప్పటి వరకు 46వేల మంది వినియోగించారని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రీపగలు కష్టపడుతున్నారు.. హైకోర్టు సూచన మేరకు కరోనా బులిటెన్‌ తెలుగులో కూడా ఇచ్చామని సీఎస్‌ స్పష్టం చేశారు. 

సోమేష్ కుమార్‌ వివరణపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని, ప్రభుత్వాన్ని, అధికారయంత్రాంగాన్ని విమర్శించాలనేది తమ ఉద్దేశం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘కరోనా నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం చాలా కష్టపడుతోంది. చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలనేదే మా ప్రయత్నం. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మా ప్రయత్నం. సుమారు 99 శాతం పర్‌ఫెక్షన్‌ వచ్చింది. రానున్న రోజుల్లో ఇదే విధంగా పనిచేయాలి’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. 

అదేవిధంగా రాష్ట్రంలో జీవోలు ఉల్లంఘించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా కరోనా వైద్యం చేశాయా? లేదా? అన్నది పరిశీలించాలని ఆదేశించింది. ఒక వేళ పేదలకు ఉచిత వైద్యం అందించకపోతే లోపమెక్కడో పరిశీలించాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్రంలో దిల్లీ తరహాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలకు పడకలు కేటాయించాలని ఆదేశించింది. ప్రభుత్వానికి వీలు కాకపోతే.. కారణాలు తెలపాలని పేర్కొంది. కరోనా బులెటిన్‌లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల వివరాలు పొందుపరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 4కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు సీఎస్‌ హాజరు అవసరం లేదని.. ప్రజారోగ్య డైరెక్టర్‌, డీఎం తదుపరి విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని