
తాజా వార్తలు
సిబ్బందికి కరోనా.. తితిదే అప్రమత్తం
దర్శనాలపై ప్రభావం పడే అవకాశం!
తిరుమల: తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో 3 నెలల విరామం అనంతరం భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులకు సేవలందించే తితిదే సిబ్బంది కరోనా బాధితులుగా మారుతుండడం శ్రీవారి దర్శనాలపై ప్రభావం చూపుతోంది. భక్తుల నుంచి నమూనాలు సేకరించినట్లే ఉద్యోగుల నుంచీ విస్తృత సంఖ్యలో నమూనాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుతం రోజుకు 13 వేల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అలిపిరి సమీపంలో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల్లో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న 17 మంది కరోనా బారిన పడ్డారు. భక్తుల ద్వారా సిబ్బందికి కరోనా సంక్రమించలేదని గుర్తించిన తితిదే.. ఉద్యోగుల నుంచీ పెద్ద సంఖ్యలో నమూనాలు సేకరించాలని నిర్ణయించింది. రోజుకు 100 మంది వరకు సిబ్బందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు తితితే అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి కరోనా ప్రభావం భయపడాల్సిన స్థాయిలో ఏమీ లేదని, అలాంటి పరిస్థితే ఎదురైతే దర్శనం కల్పించే విషయంలో పునః సమీక్ష అవసరం అని జిల్లా అధికారులు చెబుతున్నారు.