
తాజా వార్తలు
బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతి
73 మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో గురువారం ఉదయం జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ కనీసం 28 మంది మరణించగా, 73 మంది గాయాలపాలయ్యారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు, వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే బాగ్దాద్‌లోని బాబ్ అల్ షార్కీ ప్రాంతంలో గురువారం ఉదయం మొదట ఒక ఉగ్రవాది ప్రవేశించాడు. అతడు జనాలు గుమికూడేందుకు అస్వస్థతకు గురైనట్లు నటించాడు. చుట్టపక్కల ఉన్న దుకాణదారులు, ప్రజలు అతడి వద్ద గుమికూడగానే ఆత్మాహుతి చేసుకున్నాడు. ఘటనాస్థలిలో ప్రజలు సహాయక కార్యక్రమాలు ప్రారంభించగానే మరొక ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ జంట ఆత్మాహుతి దాడులతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఇరాక్ ప్రభుత్వం అక్టోబరులో ముందస్తు ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించిన కొన్ని రోజులకే ఈ దాడులు జరగటం గమనార్హం. ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. బాగ్దాద్‌లోని అన్ని ఆస్పత్రులు క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నాయని ఇరాక్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు తరుముతున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని మిలటరీ ప్రతినిధి యేహియా రసూల్ ట్విటర్లో తెలిపారు. 2018లో కూడా బాబ్ అల్ షార్కీ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 27 మంది మరణించారు.
ఇవీ చదవండి..