
తాజా వార్తలు
రీజినల్ రింగు రోడ్డు గొప్ప కానుక: కిషన్రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు లేని పథకాలేంటో సీఎం కేసీఆర్ చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులు తెరాసపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. రూ.17వేల కోట్ల వ్యయంతో 350 కి.మీ రీజినల్ రింగు రోడ్డు ఏర్పాటు కానుందని.. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన గొప్ప కానుక ఇది అని కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి్-మహబూబ్నగర్ స్థానం నుంచి బరిలో ఉన్న భాజపా అభ్యర్థి రామచందర్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించి తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
మరోవైపు నగరంలో పలుచోట్ల పట్టభద్రులతో నిర్వహించిన సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తెరాస గెలిచే పరిస్థితి లేకపోవడంతో పరోక్షంగా స్వతంత్రులకు మద్దతిస్తోందన్నారు.