
తాజా వార్తలు
అమెరికా స్వాతంత్ర్యం.. ఆసక్తికర విషయాలు
అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు. బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో బాణ సంచాలు పేలుస్తూ.. వేల మంది గుంపులుగా చేరి ఈ రోజును వేడుకగా జరుపుకొనేవారు.. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సాదాసీదాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం...
* వాస్తవానికి అమెరికాకు 1776 జులై 2నే స్వతంత్రం వచ్చింది. కానీ అందుకు కారణాలను వివరిస్తూ కాంటినెంటల్ కాంగ్రెస్.. బ్రిటన్ కింగ్ జార్జ్‌కు లేఖ రాసింది. ఆయన ఆమోదంతో జులై 4న అధికారికంగా స్వాతంత్ర్య ప్రకటన చేశారు. కానీ అమెరికా రాష్ట్రాల సంతకాలు, ఇతర ప్రక్రియలు ఆగస్టు 2 వరకు సాగాయి.
* శ్వేతసౌధంలో ఈ వేడుకలు తొలిసారిగా 1801లో జరిగాయి. అప్పటి దేశాధ్యక్షుడు థామస్ జఫర్సన్ ఈ వేడుకలను నిర్వహించారు.
* థామస్ జఫర్సన్ అమెరికా స్వాతంత్ర్య ప్రకటిస్తున్నట్లు తెలిపే ప్రకటనను రూపొందించారు. ఆయనే అమెరికా మూడో అధ్యక్షుడిగా వ్యవహరించి.. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే 1826లో జులై 4న మృతి చెందారు.
* అమెరికా 2వ అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఆడమ్స్ (1826 జులై 4 ), 5వ అధ్యక్షుడిగా వ్యవహరించిన జేమ్స్ మొన్రే (1831 జులై 4) కూడా అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజునే మరణించారు.
* అమెరికా జాతీయ పతాకంలో స్టార్స్ ఇప్పుడు ఉన్న క్రమంలో ఉండేవి కావు. 1776నాటి పతాకంలోని స్టార్స్ వలయాకారంలో ఉండేవి. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు సమానమే అని చాటి చెప్పేందుకు అలా డిజైన్ చేశారట.
* ఏటా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రోడె ఐలాండ్స్‌లోని బ్రిస్టోల్‌లో భారీ పరేడ్ నిర్వహిస్తారు. ఈ సారి కరోనా కారణంగా నిర్వహించట్లేదు.
* మొదట్లో అమెరికాకు స్వాతంత్ర్య దినోత్సవం సెలవు దినంగా ఉండేది కాదు. 1870లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం రోజున సెలవు ప్రకటించింది. ఆ తర్వాత 1941 నుంచి వేతనంతో కూడిన సెలవుగా మార్చారు.
* ఈ రోజున అమెరికా అంతటా బాణ సంచాలు కాలుస్తుంటారు. ఇవే ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణంగా ఉంటాయి. ఏటా దేశవ్యాప్తంగా ఈ వేడుకల్లో బాణసంచాల కోసం రూ. 1800 కోట్లు ఖర్చు చేస్తారట.
* జులై 4న అమెరికన్ వాసులంతా ఎక్కువగా హాట్‌డాగ్(సాండ్విచ్)ను బాగా తింటారట. ఒక్క రోజులోనే సుమారు 15 కోట్ల హాట్‌డాగ్స్‌ను లాగించేస్తారట.
* హాలీవుడ్లో చాలా సినిమాలు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలయ్యాయి. అయితే వాటిలో టాప్ 20 సినిమాలు తీసుకుంటే.. అందులో ఐదు సినిమాల్లో విల్‌స్మిత్ నటించినవే ఉన్నాయి. అందుకే ఆయన్ను ఇండిపెండెన్స్ డే ఓపెనర్ అంటుంటారు.
* అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత కొన్ని రాష్ట్రాల్లో నల్లజాతీయులు జులై 4ను ‘బ్లాక్ ఫ్రీడమ్’గా జరుపుకొన్నారు. ఈ క్రమంలో 1875 జులై 4న నల్లజాతీయులు నిర్వహించిన ఓ ర్యాలీలో ఘర్షణ నెలకొంది. ఆ తర్వాత 19 శతాబ్దం ముగిసేనాటికి ‘బ్లాక్ ఫ్రీడం’ వేడుకలు అంతరించిపోయాయి.
* 1776 జులై 4న బ్రిటన్ నుంచి అమెరికాకు స్వాతంత్ర్యం వస్తే.. 1946 జులై 4న అమెరికా నుంచి ఫిలిప్పీన్స్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. నిజానికి ఫిలిప్పీన్స్‌కు స్పెయిన్ నుంచి 1898 జూన్ 12న స్వేచ్ఛ లభించింది. కానీ స్పెయిన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా గెలిచి ఫిలిప్పీన్స్‌పై అధికారం దక్కించుకుంది. ఆ తర్వాత ‘ట్రీటీ ఆఫ్ మనీలా’ ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్‌పై అధికారాన్ని అమెరికా వదులుకుంది. అయినా ఫిలిప్పీన్స్ జూన్ 12నే స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తోంది.
- ఇంటర్నెట్ డెస్క్