ఆ రాష్ట్రం.. ఎలుకలకు అడ్డా!

తాజా వార్తలు

Published : 31/05/2021 23:25 IST

ఆ రాష్ట్రం.. ఎలుకలకు అడ్డా!

 

* మూషికాలతో ఆర్థిక, సామాజిక సంక్షోభం

కరోనాతో ప్రపంచదేశాలు విలవిల్లాడిపోతున్న వేళ.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రం మాత్రం ఎలుకల దాడులతో బెంబేలెత్తి పోతోంది. నేలమీద, ఇంటి పైకప్పుల్లో, ధాన్యపు రాశుల్లో.. ఎలుకల గుంపులు కనిపిస్తున్నాయి. లక్షల సంఖ్యలో వచ్చి పంట పొలాలపై దాడిచేసి భారీ ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటివల్ల ప్లేగ్‌ లేదా ఏదైనా కొత్త మహమ్మారి ప్రబలుతుందేమోనని ప్రజలు, అధికారులు భయాందోళనల్లో ఉన్నారు. వీటిని మట్టుపెట్టేందుకు భారత్ నుంచి ఎలుకల మందును దిగుమతి చేసుకోవాలని న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రకృతి వైపరీత్యాలతో ఏటా ఇబ్బందులు పడే ఆస్ర్టేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లో మూషికాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అనూహ్యంగా పెరిగిపోయిన వీటి సంతతి అక్కడి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎక్కడ చూసినా ఎలుకలు కనిపిస్తుండటంతో ఏంచేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాత్రివేళ గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. గడ్డికట్టల కింద ఆవాసాన్ని ఏర్పరచుకొని పశుగ్రాసాన్ని పాడుచేస్తున్నాయి. ఆస్ర్టేలియాలో వినియోగానికి అనుమతి ఉన్న జింక్ ఫాస్ఫైడ్‌ విషంతో వీటిని చంపుతున్నారు. చనిపోయిన ఎలుకలతో రోడ్లన్నీ నిండిపోగా, పరిసరాలు దుర్గంధపూరితంగా మారుతున్నాయి. ఇళ్లలోకి చేరుకున్న ఎలుకలు ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇళ్ల పైకప్పులను నాశనం చేస్తున్నాయి. విద్యుత్త్‌ వైర్లను కొరికేస్తున్నాయని, గోధుమ, బార్లీ సహా పలు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చనిపోయిన ఎలుకలు, వాటి మలమూత్రాదులతో జలాశయాలు కలుషితమవుతున్నాయి. మూషికాల కారణంగా న్యూసౌత్‌వేల్స్‌లో ఆర్థిక, సామాజిక సంక్షోభం నెలకొందని ఆ రాష్ర్ట వ్యవసాయ మంత్రి ఆడం మార్షల్‌ అన్నారు. శీతాకాలం పంటలో దాదాపు రూ.5,500 కోట్లు నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నిలువరించాలంటే మట్టుపెట్టడమే మార్గమని భావించిన అధికారులు ఎలుకల్ని చంపే పాషాణంకోసం భారత్‌వైపు చూస్తున్నారు. బ్రొమాడియాను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోవాలని ఆస్ర్టేలియా నిర్ణయించింది. 5వేల లీటర్ల బ్రొమాడియా విషాన్ని ఎగుమతి చేయాలని న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వం మన దేశాన్ని కోరింది. ఈ మందుపై ప్రస్తుతం ఆస్ర్టేలియాలో నిషేధం ఉంది. అయితే ఈ మందు ఎలుకల్నే కాకుండా, చచ్చిన ఎలుకల్ని తినే జంతువులు, పక్షులను సైతం చంపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా కరవుతో అల్లాడిన న్యూసౌత్‌వేల్స్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. 50 ఏళ్లల్లోనే కనివినీ ఎరుగని విధంగా అత్యధికంగా వరదలు సంభవించాయి. ఈ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తి కూడా తరగ్గా దానితో పాటే ఎలుకల సంఖ్య కూడా పెరిగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని