
తాజా వార్తలు
యూఎస్‌లో ‘కొత్త ఆశలకు రెక్కలు’!
పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయులకు లాభం: నిపుణులు
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే అనేక కొత్త మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విదేశీ నిపుణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ట్రంప్ సర్కారు తీసుకువచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సంస్కరిస్తూ బైడెన్ ప్రభుత్వం కొత్త యూఎస్ సిటిజన్‌షిప్ యాక్ట్ 2021ను అమెరికన్ కాంగ్రెస్‌కు పంపింది. ఇది కనుక ఆమోదం పొందితే ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఎక్కువగా ఉపయోగకరం కానుంది. ఇప్పటికే వర్క్ వీసాల మీద పనిచేస్తున్న భారతీయులతో పాటు ఇతర దేశాల నుంచి హెచ్-1బీ వీసాలు ఉన్న వారందరూ కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశాలు రాబోతున్నాయి. ఈ విధానం ద్వారా ఇతర దేశాల నుంచి అమెరికాలో ఉంటున్న వలసవాదులకు చాలా ఉపయోగకరం కాబోతోంది. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమెరికా వలసవాదుల అనుకూల వైఖరి ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందనే అంశంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
7శాతం కోటా వల్లే జాప్యం
బైడెన్ ప్రభుత్వం రాగానే యూఎస్ పౌరసత్వ సవరణ బిల్లుపై తొలి సంతకం చేస్తూ నిర్ణయం తీసుకోవడం మంచి విషయం. ఆ నిర్ణయం వల్ల అమెరికాలో హెచ్-1బీ వీసాతో ఉండే భారతీయ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉపశమనం కలగనుందని భావించవచ్చు. పాత చట్టం ప్రకారం.. గ్రీన్ కార్డు జారీ చేసేందుకు ఒక దేశానికి కేవలం 7శాతం అనే కోటా ఉండేది. యూఎస్‌లో ఎక్కువగా భారత్‌కు చెందిన ప్రొఫెషనల్స్ ఉన్నా.. ఈ కోటా వల్ల గ్రీన్ కార్డు పొందటానికి చాలా సమయం పట్టేది. అయితే ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త చట్టం ద్వారా ఆ పాత కోటాతో కాస్త ఉపశమనం కలిగి వీలైనంత ఎక్కువ శాతం మందికి త్వరగా పౌరసత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ఆలపాటి శుభకర్ (గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టేన్సీ వ్యవస్థాపకులు)
ట్యాక్సులు కట్టిన భారతీయులు లక్షల్లో
అమెరికాలో ఉండి ఎవరైతే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పన్నులు కడుతున్నారో వారు గ్రీన్ కార్డు పొందటానికి అర్హత ఉంటుందనేది బైడెన్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఇది త్వరగానే కాంగ్రెస్‌లో అనుమతి పొంది అమలులోకి వస్తుందని అనుకుంటున్నాం. అయితే దీని వల్ల భారతీయులకు ఎంతో లాభం చేకూరనుంది. ఎందుకంటే అన్ని ట్యాక్స్‌లు కట్టి పౌరసత్వాన్ని పొందేందుకు అర్హత కలిగిన భారతీయులు అమెరికాలో లక్షల మంది ఉన్నారు. పీహెచ్డీ వంటి ఉన్నత విద్యార్హత కలిగిన వారికి నేరుగా పౌరసత్వం కల్పించేట్లుగా ఒబామా తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ అమలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కూడా ఎంతో మంచి పరిణామమనే చెప్పవచ్చు. ఇలా వివిధ రకాలుగా భారతీయులకు అనుకూలమనే చెప్పవచ్చు.
- ఎం వెంకటేశ్వర్‌రెడ్డి (వరల్డ్‌వైడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఫౌండర్ )
విద్యార్థులకు హెచ్-1బీ సులభతరం
బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్టెమ్ విద్యార్థులకు హెచ్-1బీ వీసాకు మార్గం సులభతరం చేస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ కావచ్చు, ట్రంప్ పాలనే కావచ్చు కారణం ఏదైనా అమెరికాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. అది దాదాపు 37శాతం తగ్గిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ విద్యార్థులు రావడంపై ప్రభుత్వం తప్పనిసరి మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు చదువుల అనంతరం ఉద్యోగాలు చేసుకుని హెచ్‌పీటీ పూర్తి చేసుకుని హెచ్-1బీకి వెళ్లడం సులభతరం అవుతుంది’ అని తెలిపారు.
- అజయ్ కుమార్ ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్
పూర్తి వివరాలు, నిపుణుల అభిప్రాయల గురించి కింది వీడియోను చూడండి..