గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: ఉత్తమ్‌
close

తాజా వార్తలు

Published : 24/04/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: ఉత్తమ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కొవిడ్‌ విజృంభిస్తోన్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు కరోనా బారినపడే ప్రమాదం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలకు; సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సమస్యలపై వివరిస్తూ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఉత్తమ్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉందని.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) తలొగ్గిన్నట్లు ఆరోపించారు. ఈ గడ్డు పరిస్థితుల్లో గవర్నర్‌గా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

‘‘ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీ అనాలోచిత నిర్ణయాలు, పక్షపాత ధోరణిని గవర్నర్‌ గమనించాలి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే పద్ధతిని ఎస్‌ఈసీ మర్చిపోయింది. కొవిడ్ సెకండ్‌ వేవ్‌లో పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 15న మినీ పుర ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం తొందరపాటు చర్య. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉందని తెరాస భావించింది. ఆ ప్రభావం పుర ఎన్నికలపై పడకుండా రాజకీయ ఆదేశాలను ఎస్‌ఈసీ అనుసరించింది. 

కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు కూడా తప్పుబట్టింది. కొవిడ్‌ను సాకుగా చూపించి ప్రైవేటు ఆస్పత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్స అందిస్తోంది. తెలంగాణాలో మాత్రం చేర్చడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలి. కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత నిర్వహించాలి. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి’’ అని లేఖలో ఉత్తమ్‌ పేర్కొన్నారు.

లేఖ అందిన వెంటనే తనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఫోన్ చేసి మాట్లాడారని.. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని ఉత్తమ్‌ తెలిపారు. ఈ అంశంపై ఎస్‌ఈసీతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని