
తాజా వార్తలు
లక్ష్యం దిశగా నడవమని..
డాక్టర్ కావాలన్న ఆశయం తనది. అందుకు తగ్గట్టుగా కష్టపడి చదివేది. మంచి మార్కులు సాధించేది. ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ ఇంట్లో పెళ్లి సంబంధం నిశ్చయించారు పెద్దలు. పదహారేళ్లకే పెళ్లిపీటలు ఎక్కించాలనుకున్నారు. కానీ, తెలివిగా పెళ్లి గండం నుంచి తప్పించుకుందా అమ్మాయి. ఇప్పుడు ఇంటర్లో మంచి మార్కులు సాధించింది.కలెక్టర్‌ను మెప్పించి ఆమె నుంచి స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా అందుకుంది.
ఈ కథంతా.. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం ఈకల్ గ్రామానికి చెందిన మల్యాల సమతది. ఆరేళ్ల వయసులో తల్లిని కోల్పోయింది. అమ్మమ్మ ఇంట్లో ఉండి పదో తరగతి వరకూ చదువుకుంది. పది మంచిమార్కులతో పాసైంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద కేజీబీవీలో ఇంటర్లో చేరింది. డాక్టర్ లక్ష్యంతో బైపీసీ తీసుకుంది. మొదటి సంవత్సరం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. అంతలోనే పెద్దలు వివాహం నిశ్చయించారు. సమత ఎంతో చైతన్యంతో బాలల సంరక్షణ అధికారులకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసింది. వారు వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. మళ్లీ కళాశాలకు వెళ్లడం మొదలుపెట్టింది సమత. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందింది. రెండేళ్లకు గానూ 886 మార్కులు సాధించింది. ఇప్పుడు ఎంబీబీఎస్ సీటు లక్ష్యంగా నీట్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతోంది.కరోనా కారణంగా శిక్షణ తరగతులు నడవడం లేదు. దీంతో తనకు ఆన్లైన్ తరగతులు వినే అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరితకు సమత ఒక లేఖ రాసింది. వెంటనే కలెక్టర్ స్పందించి ఆమెను పిలిపించారు. స్మార్ట్‌ఫోన్‌ను కానుకగా అందించి, అభినందించారు. ‘మా అమ్మ సరైన వైద్యం అందక చనిపోయింది. అందుకే పేదలకు వైద్య సాయం అందించడానికి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను’ అని చెబుతోంది సమత.
- జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్
మరిన్ని ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.netలో..