
తాజా వార్తలు
ఆ మచ్చ పోవాలంటే...
నా చేతికి ఆపరేషన్ కావడంతో మచ్చ అలాగే ఉండిపోయింది. స్లీవ్‌లెస్‌లు, మోడ్రన్ బ్లౌజ్‌లు వేసుకున్నప్పుడు మచ్చ బయటకు కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటోంది. ఇది పోవాలంటే ఏం చేయాలో చెప్పగలరు.
- ఓ సోదరి
మచ్చను ఎవరూ పూర్తిగా తొలగించలేరు. అయితే కొన్ని పద్ధతుల ద్వారా సైజును తగ్గించి, స్పష్టంగా కనిపించకుండా చేయగలరు. సాధారణంగా ఆపరేషన్ చేసిన తర్వాత హీలింగ్ చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది. కుట్లు ఎంత లోతు వరకు పడ్డాయి, ఆపరేషన్ చేయించుకున్న వారి వయసు వంటి విషయాల మీదా ఆధారపడి ఉంటుంది. అలాగే బాగా కదిలే భాగంలో కుట్లు పడితే మచ్చ విస్తరించే అవకాశముంది. సిలికాన్జెల్ షీట్స్, స్కార్ క్రీమ్‌లు వాడటం ద్వారా మచ్చ తీవ్రతను తగ్గించవచ్చు. దీనికి షియాబటర్, స్టిరిక్యాసిడ్ రాసి పైన సిలికాన్జెల్ షీట్స్ వేయడం ద్వారా తగ్గించవచ్చు. తగ్గడానికి క్రీమ్‌లు కొనేముందు దాంట్లో సిలికాన్, ఆనియన్ ఎక్స్స్ట్రాక్ట్, అలోవెరా క్రీమ్, గ్రీన్‌టీ ఎక్స్స్ట్రాక్ట్ ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల మచ్చ నలుపురంగు తగ్గుతుంది. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పెద్ద మచ్చను చిన్నగా చేయొచ్చుగానీ పూర్తిగా నిర్మూలించలేరు. స్కిన్‌గ్రాఫ్ట్ ద్వారా వేరేచోట నుంచి చర్మం తీసుకుని ఇక్కడ కుడతారు. లేజర్ సర్జరీ ద్వారా మచ్చ పై చర్మాన్ని తొలగిస్తారు. తర్వాత అక్కడ మెల్లగా కొత్త చర్మం వస్తుంది. ఈ పద్ధతిలో కూడా పూర్తిగా మచ్చను తొలగించలేరు. కొందరికి మచ్చ ఉన్నచోట దురద కూడా ఉంటుంది. ఇంజక్షన్లు చేసి దాన్ని నివారించవచ్చు. కెమికల్ పీలింగ్ ద్వారాను మచ్చను కొంతవరకు తగ్గించవచ్చు.
సహజమైన పద్ధతులు..
విటమిన్-ఇ, అలోవెరా, కోకోబటర్, రెటనాల్ క్రీమ్ పాత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. మరీ ఇబ్బందిగా ఉంటే లేజర్ చికిత్సకు వెళ్లవచ్చు. అయితే ఏ చికిత్సలోనూ మచ్చను పూర్తిగా తొలగించడం వీలుకాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.