విజయవాడ: భార్యను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడ: భార్యను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష

విజయవాడ: భార్యపై పెట్రోల్‌ పోసి హత్య చేసిన కేసులో భర్తకు విజయవాడ మహిళా సెషన్స్‌ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2019లో నగరంలోని కృష్ణలంకలో గర్భవతిగా ఉన్న తన భార్యపై భర్త బత్తుల నంబియార్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె మృతిచెందింది. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే..

కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగాయపాలెంకు చెందిన ముక్కు మోహనరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె శైలజ.. తన ఇద్దరు చెల్లెళ్లు పద్మజ, జ్యోతి, తమ్ముడు అరవింద్‌ కుమార్‌తో కలిసి కొన్నేళ్ల కిందట లబ్బీపేటలోని ఫకీర్‌గూడెం పిడికిటి రామకోటయ్య వీధిలోని ఒక ఇంట్లో అద్దెకు దిగారు. అందరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. బీఎస్సీ బీఈడీ చదివిన శైలజ(30) టిక్కిల్‌రోడ్‌లోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమెకు కృష్ణాజిల్లా జొన్నపాడు నివాసి, గుడివాడలో ప్రైవేటు కళాశాలలో సహాయ అధ్యాపకుడిగా పనిచేస్తున్న బత్తుల నంబియార్‌(35) అలియాస్‌ సుజిత్‌తో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే అతడు ఉద్యోగాన్ని మానేసి, విజయవాడ ఫకీర్‌గూడెంలోని భార్య వద్దే ఉండేవాడు. ఆమె సంపాదనపైనే ఆధారపడి జీవించేవాడు.

ఈ నేపథ్యంలో భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం అతనిలో మొదలైంది. ఇవే విషయాలను పలు సందర్భాల్లో మరదళ్లు, అత్త వద్ద ప్రస్తావించినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీనికి తోడు ఇటీవల శైలజ తన ఇద్దరు చెల్లెళ్లకు, తమ్ముడికి వివాహాలు జరిపించడంతో నంబియార్‌లో అసూయ రేగింది. గర్భిణి అయిన ఆమెను అంతం చేయాలనే నిర్ణయానికి వచ్చి ఇంట్లో తాను, భార్య తప్ప ఇతరులు లేని సమయం చూసి, తెల్లవారుజామున నిద్రలో ఉన్న శైలజ ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగు వారు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ కొద్దిసేపటికే ఆమె మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నంబియార్‌ను కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం నంబియారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని