
తాజా వార్తలు
విజయవాడ తెదేపా మేయర్ అభ్యర్థి ఖరారు
అమరావతి: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిని తెదేపా ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను ఖరారును చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు.
24 ఏళ్ల కేశినేని శ్వేత అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో బీఏ (సైకాలజీ, ఎకనామిక్స్) చేశారు. ఘనాలో మైక్రో ఫైనాన్స్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్.. ఐర్లాండ్‌లో చైల్డ్ సైకాలజీ ప్రోగ్రామ్‌లో ఆమె పనిచేశారు. టాటా ట్రస్ట్‌కు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ శ్వేత వివిధ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొండపైన, కింద ప్రాంతాలను పలుమార్లు సందర్శించారు. అక్కడ గుర్తించిన సమస్యలపై ఎంపీ కేశినేని నానికి నివేదిక అందజేసి వాటి పరిష్కారానికి కృషి చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర సరకులు, మాస్కులు, శానిటైజర్లను ఆమె ఉచితంగా పంపిణీ చేశారు. 2014, 2019 ఎన్నికల సమయంలో విజయవాడ నగర పరిధిలోని తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకోసం కేశినేని శ్వేత ప్రచారంలో పాల్గొన్నారు.