
తాజా వార్తలు
మహిళ అంటే.. మాతృత్వానికి మించి..
కన్నీళ్లు పెట్టిస్తున్న వైరల్ యాడ్
ఆడవాళ్లకి మాతృత్వం వరమే.. కానీ తల్లికాకపోవడం శాపమేమీ కాదుగా..! ఓ కూతురిగా, భార్యగా, కోడలిగా, ఉద్యోగినిగా ఇలా నిత్య జీవితంలో మహిళ ఎన్నో పాత్రలు పోషిస్తున్నా.. వృత్తిపరంగా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నా.. పిల్లలు లేకపోతే ఆమె పరిపూర్ణం కాదనే భావన ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. సంతానలేమి కారణంగా మహిళ అనుభవిస్తున్న మౌనవేదన ఆమెను మానసికంగా కుంగదీస్తోంది. ఇకనైనా ఆ ధోరణి మారాలి.. మహిళ అంటే పిల్లలను కనడం మించి అనే ఆలోచన రావాలి. ఎందుకంటే మహిళగా ఆమె ఎప్పటికీ పరిపూర్ణమే..
ఇదే విషయాన్ని సమాజానికి చాటిచెప్పే ప్రయత్నం చేసిందో సంస్థ. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకుని ప్రత్యేక యాడ్ రూపొందించింది. ప్రముఖ నటి మోనా సింగ్ ఇందులో లత పాత్రలో నటించారు. ఇంటికి పెద్దకోడలు అయిన ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తనకంటే చిన్నదైన తోటికోడలు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. పిల్లలు లేని లత ఆ బాధను గుండెల్లోనే దాచుకుని కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటారు. ఒక రోజు పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలని కుటుంబసభ్యులు ఆమెను అడిగేసరికి మరింత ఉద్వేగానికి గురవుతారు.
తన కన్నీళ్లు బయటపడకుండా లత అక్కడి నుంచి లేచివెళ్లిపోతుంటే తోటికోడలు లేచి.. ‘‘నా బిడ్డకు అక్క పేరే పెట్టుకుంటాను. ఇంటికి పెద్ద కోడలిగా.. ఉపాధ్యాయురాలిగా.. ఎన్నో బాధ్యతలు చేపడుతున్నావు. కష్టసమయంలో కుటుంబానికి అండగా ఉన్నావు. నీ చుట్టూ ఉన్నవాళ్లందరికీ ఆనందాన్ని పంచుతావు. అందుకే నా కూతురికి నీ పేరే పెడతాను’’ అనడంతో లత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సంతానలేమి కారణంగా మహిళ సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే వాటిని మౌనంగా భరించాల్సి వస్తోంది. ఇప్పటికైనా సమాజంలో మహిళ అంటే పిల్లలు మాత్రమే అనే ఆలోచన మారాలనే ఉద్దేశంతో సదరు సంస్థ ఈ యాడ్‌ను రూపొందించింది. SheIsCompleteInHerself హ్యాష్‌ట్యాగ్‌తో రూపొందించిన ఈ యాడ్.. ఎంతోమంది నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. ఇప్పటికే 18లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ‘‘కన్నీళ్లు ఆగడం లేదు’’ అంటూ పలువురు వీక్షకులు రాసుకొచ్చారు.