విశాఖ ఉక్కు ఆందోళన ఉద్ధృతం
close

తాజా వార్తలు

Updated : 09/03/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 విశాఖ ఉక్కు ఆందోళన ఉద్ధృతం

విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన సమాధానంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ... కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ ఉక్కు ..ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు నినదించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంపీలంతా రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు.

డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వాహనాన్ని అడ్డుకున్న ఆందోళనకారులు
పరిశ్రమ వద్దకు వచ్చిన డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వాహనాన్ని నిరసనకారులు చుట్టుముట్టి అడ్డుకున్నారు. ఈక్రమంలో నిరసన కారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్మికుల ఆందోళనతో గాజువాక, అగనంపూడి పరిసరాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  గాజువాక పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బందికి ఆలస్యం కావడంతో పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది చేరవేతకు 80 బస్సులు ఏర్పాటు చేశారు. దారిమళ్లింపుతో పీవోలు, ఏపీవోలు సకాలంలో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారు.  

సీఎం నైతిక బాధ్యత వహించాలి: నారాయణ
ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైన పరిశ్రమ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అని అనేక ఉద్యమాలతో దాన్ని సాధించుకున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆర్థికపరంగా, ప్రజల మనోభావాలకు సంబంధించి స్టీల్‌ ప్లాంట్‌ ప్రత్యేకత చాటుకుందని వివరించారు. పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించడంతో సీపీఐ ఆందోళనలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ ముందు నుంచీ హెచ్చరిస్తూనే వచ్చిందన్నారు. కేవలం ఉత్తరాలతో న్యాయం జరగదని చెప్పినా సీఎం జగన్‌ పెడచెవిన పెట్టారని విమర్శించారు. స్టీ్‌ల్‌ ప్లాంట్‌పై సీఎం తన పార్లమెంట్‌ సభ్యులతో రాష్ర్టంలో ఓ మాట, దిల్లీలో మరో మాట మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ నిర్ణయంపై సీఎం నైతిక బాధ్యత వహించాలని నారాయణ డిమాండ్‌ చేశారు. 

 
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని