అమెరికా, చైనా మాటల యుద్ధం
close

తాజా వార్తలు

Updated : 20/03/2021 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా, చైనా మాటల యుద్ధం

 తొలి ఉన్నత స్థాయి భేటీలోవాడీవేడీ వాదనలు

వాషింగ్టన్‌: అమెరికా, చైనా ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు బహిరంగంగా మాటల యుద్ధానికి దిగారు. అమెరికా అధ్యక్షునిగా బైడెన్‌ అధికారం చేపట్టిన తరువాత జరిగిన తొలి సమావేశమే గరం గరంగా సాగింది. ముఖాముఖి రూపంలో జరిగిన ఈ భేటీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. గురువారం అలస్కాలోని యాంకరేజ్‌లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్‌ పాల్గొన్నారు. చైనా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యి, కమ్యూనిస్టు పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్‌ కమిషన్‌ డైరెక్టర్‌ యాంగ్‌ జైయెచి హాజరయ్యారు. యాంగ్‌ అమెరికాలో చైనా రాయబారిగా కూడా పనిచేయడం గమనార్హం. చర్చలు జరిగిన సమయంలో మీడియా కూడా హాజరయింది. 

వాదోపవాదాల సారాంశం ఇలా...
బ్లింకెన్‌ (అమెరికా): అమెరికా ప్రయోజనాలు కాపాడడంతో పాటు నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ ఉండాలని బైడెన్‌ ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ అంతర్జాతీయ వ్యవస్థ కేవలం ఊహారూపంలో ఉండేది కాదు. దేశాలన్నీ తమ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి అవకాశం కల్పించేది. ప్రతి ఒక్కరూ ప్రపంచ వాణిజ్యంలో పాల్గొనడానికి వీలు కల్పించేది. అందరూ ఒకే తరహా నిబంధనలు పాటిస్తున్నారన్న భరోసా కల్పించేది. దీనికి బదులుగా మరో వ్యవస్థ ఉంటే బలవంతులదే రాజ్యం అవుతుంది. విజేతలే అన్నీ దక్కించుకుంటారు. అది హింసాత్మక, అస్థిర ప్రపంచానికి దారి తీస్తుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రాధాన్యతలను చర్చించడానికి ఇదొక అవకాశం. బైడెన్‌ ప్రభుత్వ అభిప్రాయాలు, విధానాలను చైనా అర్ధం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సింగ్‌యాంగ్, హాంకాంగ్, తైవాన్‌ విషయాల్లో చైనా వ్యవహరించిన తీరు ఆందోళన కలిగిస్తోంది. అమెరికాపై చేసిన సైబర్‌ దాడులు, మా మిత్రుల విషయంలో అనుసరిస్తున్న ఆర్థిక నిర్బంధం కూడా ఆందోళనకరమే. ప్రతి ఒక్క చర్యా అంతర్జాతీయ సుస్థిరతకు, నిబంధనల ఆధారిత వ్యవస్థకు ముప్పు కలిగించేవే. అందువల్ల అంతర్గత వ్యవహారాలకు పరిమితం కాకుండా ఈ అంతర్జాతీయ వ్యవహారాలను కూడా ప్రస్తావించాల్సిన బాధ్యత మాపై ఉందని భావిస్తున్నాం.

యాంగ్‌ (చైనా): ఐక్యరాజ్యసమితి రూపొందించిన అంతర్జాతీయ విధానాన్నే చైనా అనుసరిస్తోంది. అంతే తప్ప కొద్ది మంది చెబుతున్న నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను కాదు. అమెరికాకు వారి తరహా ప్రజాస్వామ్యం ఉంటే.. చైనాలో ఆ దేశ తరహా ప్రజాస్వామ్యం ఉంది. అమెరికా ప్రజాస్వామ్యం ఏ విధంగా అభివృద్ధి చెందుతోందో ఒక్క అమెరికన్లే కాదు.. మొత్తం ప్రపంచమే పరిశీలించాల్సి ఉంది. అమెరికా తన విధానాలను మార్చుకోవాల్సి ఉంది. తాను అనుసరిసున్న ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంపై రుద్దడం మానుకోవాలి. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే వ్యతిరేకిస్తాం. ఇలాంటి జోక్యంపై గట్టి ప్రతిచర్యలు ఉంటాయి. మానవహక్కులపై అమెరికాయే మరింతగా కృషి చేయాల్సి ఉంది.
సల్లివాన్‌ (అమెరికా): చైనాతో ఘర్షణ కోరుకోవడం లేదు. అయితే అమెరికా ఎల్లప్పుడు విలువలు, ప్రజలు, స్నేహితుల కోసం కట్టుబడి ఉంది.
వాంగ్‌ (చైనా): అమెరికా చేస్తున్న అనవసర ఆరోపణలను గతంలో ఎన్నడూ చైనా అంగీకరించలేదు. భవిష్యత్తులోనూ ఆమోదించదు. ఆధిపత్య ధోరణి చూపుతూ చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలి. ఇదే చిరకాల సమస్యగా ఉంది. దీన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.
బ్లింకెన్‌ (అమెరికా): ప్రపంచంలో మా పాత్ర, భాగస్వాములు, స్నేహితులతో మా వ్యవహారాలు..ఇవన్నీ పూర్తిగా స్వచ్ఛందమైనవి. అధ్యక్షుడు బైడెన్‌ కూడా ఈ విధానాన్నే కోరుకుంటున్నారు.
యాంగ్‌ (చైనా): భాగస్వాములు, మిత్రులు అయినంత మాత్రాన అమెరికా ఆ దేశాల తరఫున ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదు. ఇలా అయితే అంతర్జాతీయ సంబంధాలు బలపడడం కష్టం. బలప్రయోగం చేస్తున్నారంటూ ఒక దేశాన్ని ఎలా అనగలుగుతారు? ఎవరిపై ఎవరు బలప్రయోగం చేస్తున్నారు? చరిత్ర, అంతర్జాతీయ సమాజమే దీనిపై తీర్పు చెబుతుంది.

అసలే అమెరికా-చైనా సంబంధాలు అంతంత మాత్రంగా ఉండగా నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన తొలి సమావేశం తీరు మరింత నిరాశ కలిగించేదిగా ఉంది. అనంతరం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ బీజింగ్‌లో మాట్లాడుతూ అమెరికా అధికారులే తొలుత కవ్వించే ధోరణిలో మాట్లాడారని అన్నారు. చైనా అధికారులు దీటుగానే సమాధానం ఇచ్చారని చెప్పారు. అమెరికా తొలిపలుకుల్లోనే మందుగుండు వాసనను, నాటకీయతను పసిగట్టామని తెలిపారు. చైనాపై నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని