
తాజా వార్తలు
జాగిలానికి అరుదైన వీడ్కోలు.. వీడియో వైరల్!
నాశిక్: మహారాష్ట్ర పోలీసు విభాగంలో ఏళ్ల తరబడి విశేష సేవలందించినందుకు గానూ ఓ జాగిలం అద్వితీయమైన వీడ్కోలు అందుకుంది. పూలతో అలంకరించిన వాహనం బ్యానెట్‌పై జాగిలాన్ని కూర్చోబెట్టి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ ప్రశంసలు తెలియజేశారు.
‘‘రాష్ట్ర పోలీసు శాఖలో 11ఏళ్లు సేవలందించిన ‘స్నిఫర్ స్పైక్’ జాగిలానికి నాసిక్ పోలీసులు ప్రత్యేక వీడ్కోలు అందించారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో ఆ జాగిలం అందించిన సేవలు అమోఘం. పోలీసు శాఖకు అది కేవలం శునకం మాత్రమే కాదు.. మా కుటుంబంలో ఒక భాగం కూడా. ఆ జాగిలానికి నేను సెల్యూట్ చేస్తున్నాను’’ అని అనిల్ దేశ్‌ముఖ్ ట్వీట్లో పేర్కొంటూ వీడియో పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో పూలతో అలంకరించిన వాహనంపై జాగిలాన్ని కూర్చొబెట్టి.. పోలీసులు చప్పట్లతో ఆ వాహనాన్ని సాగనంపి వీడ్కోలు పలికిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
స్నిఫర్ స్పైక్ జాగిలాల్ని బాల్య దశలోనే పోలీసు శాఖలోకి తీసుకుని.. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, ఆయుధాలను గుర్తించడంలో నైపుణ్యాలు నేర్పిస్తారు. ఇటీవల కొవిడ్-19 లక్షణాలను కూడా పసిగట్టేలా వీటికి ఇండియన్ ఆర్మీ శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే.