‘ఫైర్‌బ్రాండ్‌’ను కాషాయం అడ్డుకోగలదా..?
close

తాజా వార్తలు

Updated : 22/03/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఫైర్‌బ్రాండ్‌’ను కాషాయం అడ్డుకోగలదా..?

బెంగాల్‌లో భాజపా గెలుపు అవకాశాలపై ప్రత్యేక కథనం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికారం కైవసం చేసుకోవాలనే దశాబ్దాల కలను భారతీయ జనతా పార్టీ నెరవేర్చుకోగలదా? ప్రభుత్వ వ్యతిరేక పవనాలను అనుకూలంగా మార్చుకోగలదా? ‘బెంగాల్‌ ప్రైడ్‌’ పేరుతో తృణమూల్‌ అధినేత్రి, ఫైర్‌బ్రాండ్‌ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని ఎదురొడ్డగలదా..? బెంగాల్‌ పీఠం సాధనలో కమలదళానికి అనుకూలించే అంశాలేమిటి? ప్రతికూలతలు ఏమిటి? వీటిపై ప్రత్యేక కథనం.. 

ఎనిమిదేళ్లలో 10 రెట్లు పెరిగిన ఓటు శాతం
అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై వ్యతిరేకత.. హిందూత్వ సిద్ధాంతం.. కేంద్రంలో అధికారం.. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా.. కలగలిసి పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని భాజపా భావిస్తోంది. కమలదళానికి పూర్వ రూపమైన జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ పురిటిగడ్డపై అధికారంలోకి రావడమనేది కమలదళ దశాబ్దాల కల. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.. గత  లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపు.. బంగ్లాదేశ్‌ శరణార్థుల అంశం.. కాషాయ పార్టీకి అనుకూలిస్తున్న అంశాలు. ఈ అంశాలే బెంగాల్‌లో భాజపా ఓట్ల శాతాన్ని ఎనిమిదేళ్లలో 10 రెట్లు పెంచాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 42కి 18 స్థానాలు సాధించేందుకు కారణమయ్యాయి. అయితే సంస్థాగతంగా బలహీనంగా ఉండటం, బయటవారు అనే ముద్ర మమతా బెనర్జీకి దీటుగా నిలబడే సీఎం అభ్యర్థి లేకపోవడం కమలదళాన్ని కలవరపెడుతున్నాయి. 

గెలిస్తే సైద్ధాంతిక విజయమే..
2011 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓట్లు 4 శాతం కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో అది ఏకంగా 40 శాతానికి ఎగబాకింది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో 294 స్థానాలు ఉండగా.. ఈ ఎన్నికల్లో 200లకు పైగా సీట్లు గెలుస్తామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. తూర్పు భారతంలో కీలకరాష్ట్రమైన బెంగాల్‌ను గెలవాలని భాజపా ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తోంది. అంచనాల మేరకు భాజపా బెంగాల్‌లో గెలిస్తే అది సైద్ధాంతిక విజయం అవుతుందని ఆ పార్టీ నేత తదాగత్‌రాయ్‌ పేర్కొంటున్నారు. 1952లో హిందూ మహాసభ, భారతీయ జన్‌సంఘ్‌ కలిసి పశ్చిమ బెంగాల్‌లో 13 అసెంబ్లీ సీట్లను సాధించాయి. అవి సాధించిన ఓట్లు 8 శాతం. 1953లో జన్‌సంఘ్‌ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ మరణం తర్వాత బెంగాల్‌లో వామపక్షాలు బలపడ్డాయి. 1967, 1971లో జన్‌సంఘ్‌ ఒక్కో స్థానంతో సరిపెట్టుకుంది.

కాంగ్రెస్‌, వామపక్షాలు బలహీనపడటంతో...
1980లో భాజపా స్థాపన తర్వాత ఆ పార్టీ బెంగాల్‌లో తన స్థానం సుస్థిరపరచుకోలేకపోయింది. 34 ఏళ్ల వామపక్ష పాలనలో 1998, 1999 మినహా కమలదళం ప్రభావం చూపలేకపోయింది. అప్పుడు టీఎంసీతో జట్టుకట్టిన భాజపా రెండు లోక్‌సభ స్థానాలు, ఉప ఎన్నికల్లో ఒక అసెంబ్లీ స్థానంలో గెలుపొందింది. 2011లో వామపక్షాల కంచుకోటను టీఎంసీ బద్దలుకొట్టి అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. వామపక్షాలు, కాంగ్రెస్‌ క్రమంగా పట్టుకోల్పోవడంతో భాజపా ఎదుగుదల సాధ్యపడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ సొంతంగా 19 శాతం ఓట్లు, రెండు లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు, 11 శాతం ఓట్లు సాధించింది. 2019లో పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపా పుంజుకోవడంతో టీఎంసీ ఓట్ల శాతం 43 శాతంగా మారింది. వామపక్షాల ఓట్ల శాతం 29 నుంచి 7 శాతానికి, కాంగ్రెస్‌ ఓట్ల శాతం 6 నుంచి 4కు పడిపోయింది. ప్రతిపక్షాలు కోల్పోయిన బలమే 2019లో భాజపాకు 40 శాతం ఓట్లు సాధించేందుకు కారణమైనట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ.. 
ఒకప్పుడు వామపక్షాలు, టీఎంసీ బలంగా ఉన్న జంగల్‌మహల్‌, బంగ్లాదేశ్‌ శరణార్థులు ఎక్కువగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లో భాజపా బాగా పంజుకొంది. బెంగాల్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆరెస్సెస్‌ కార్యక్రమాలు పెరగడం కాషాయపార్టీ బలోపేతానికి కారణమయ్యింది. సువేందు అధికారి, రజీబ్‌ బెనర్జీ వంటి తృణమూల్‌ బలమైన నాయకులకు పార్టీ తలుపులు తెరవడం భాజపా అధినాయకత్వ వ్యూహంలో కీలక అంశమని నేతలు పేర్కొంటున్నారు. ఫలితంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అనే సంకేతం ప్రజల్లోకి వెళుతుందని కలమదళం భావన.

అంతర్గత పోరుతో ఇబ్బందులు
ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం ద్వారా తమ పార్టీ బలంగా ఉందని చాటే ప్రయత్నం కమల దళానికి తల నొప్పులు తెచ్చిపెట్టిందని భాజపా నేతలు చెబుతున్నారు. ఇతర పార్టీల నేతలకు ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం ద్వారా మొదటి నుంచీ పార్టీలో ఉన్న నేతలు, వారి అనుచరుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సరిగ్గా పరిశీలించకుండానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చేర్చుకోవడం ఇబ్బందికరంగా మారింది. తద్వారా భాజపాలో అంతర్గత పోరు కొనసాగుతోందని నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌-లెఫ్ట్‌-ఐఎస్‌ఎఫ్‌ కూటమి వల్ల విపక్ష ఓట్లు చీలిపోతాయని కమలం పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. 

ఎన్నికల బూత్‌లలో ప్రాతినిథ్యం కరవు
బెంగాల్‌లోని లక్ష ఎన్నికల బూత్‌లలో కమలదళానికి ప్రాతినిథ్యం లేకపోవడం పెద్ద బలహీనతగా మారింది. ఆ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ఇతర రాష్ట్రాల నాయకులతో ప్రచారం చేయడం టీఎంసీ ఔట్‌సైడర్స్‌ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. తృణమూల్‌ ఎత్తుకున్న బెంగాల్‌ ప్రైడ్‌ నినాదం భాజపా జాతీయ వాదం అంశానికి ధీటుగా పనిచేస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ వంటగ్యాస్‌ ధరల పెరుగుదలను తృణమూల్‌ సొమ్ము చేసుకునే అవకాశాలు ఉన్నాయని భాజపా నేతలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి ఓడినా భాజపాకు నష్టమేమీలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌ వరకు కేంద్రంలో భాజపా సర్కారుపై వ్యతిరేకత ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని