బెంగాల్‌లో నువ్వా.. నేనా..?
close

తాజా వార్తలు

Published : 22/02/2021 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌లో నువ్వా.. నేనా..?

మా మాటి మానుష్‌ vs సోనార్‌ బంగ్లా

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పోరాటం తీవ్రస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికల్లో భారీగా పుంజుకున్న భాజపాలు పోటాపోటీగా రంగంలోకి దిగుతున్నాయి.   2011లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని వామపక్షకూటమిని ఓడించి అధికారంలోకి వచ్చింది. తృణమూల్‌ కూటమి 228 సీట్లు సాధించగా అందులో తృణమూల్‌వి 184 సీట్లు ఉండటం విశేషం.

2016లోనూ అదే జోరు..
2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తృణమూల్‌ అదే జోరు కొనసాగించింది.  అంతకు ముందు కంటే ఎక్కువగా.. 211 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అద్వితీయ శక్తిగా ఎదిగింది. వామపక్షకూటమి 32 సీట్లను మాత్రమే సాధించడంతో మమతా బెనర్జీ తిరుగులేని శక్తిగా మారింది.  భూసంస్కరణలు, గ్రామీణ బెంగాల్‌పై ప్రత్యేకదృష్టి, విద్యుత్‌ సరఫరా, నీటి వసతి.. తదితర సౌకర్యాలను మెరుగుపరచడం..తదితర అంశాలు ఆమె గెలుపునకు దోహదం చేశాయి. ప్రత్యేకించి కన్యాశ్రీ, విద్యార్థినులకు సైకిళ్లు,  వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలు నెలకొల్పడం తృణమూల్‌పై ప్రజల అభిమానం పెరిగేందుకు ఉపకరించాయి.

మరి 2021 ఎలా ఉండనుంది.,
ఒక దశాబ్దానికి పైగా బెంగాల్‌ను ఏలుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ రానున్న ఎన్నికల్లో భాజపా నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న భాజపా  2019 ఎన్నికల్లో ఏకంగా 19 సీట్లను గెలుచుకుంది. అప్పటివరకు రాష్ట్రంలో తృణమూల్‌కు పోటీగా వామపక్షాలు, కాంగ్రెస్ ఉండేవి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గణనీయమైన ఫలితాలను సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్‌, అసన్‌సోల్‌ సీట్లను మాత్రమే గెలుచుకున్నప్పటికీ.. 2019లో ఏకంగా 19 సీట్లను గెలుచుకోవడం రాష్ట్రంలో కమలం బలపడుతున్న తీరుకు అద్దం పడుతోంది.

భాజపా జోరు
రాష్ట్రంలో భాజపా క్రమంగా ఎదుగుతోంది. తృణమూల్‌కు ప్రత్యామ్నాయ పార్టీ తామేనని ప్రజలకు వెల్లడించడంలో సఫలీకృతమైంది. దీంతో పాటు రాష్ట్రంలో  బలమైన పార్టీలుగా ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్‌లు తమ ప్రాభావాన్ని కోల్పోయాయి. వామపక్షాలు, కాంగ్రెస్‌లకు చెందిన బలమైన నేతలు, కార్యకర్తలు భాజపా వైపు మళ్లడంతో కమలవికాసం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారు రాష్ట్రంలో లక్షలుగా ఉన్నారు. వీరికి స్థానికులతో పొసగడం లేదు. ఈ అంశంపై తాము అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను పంపేస్తామని భాజపా హామీ ఇస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు కేవలం 3 సీట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో భాజపా ఓటుశాతం 10 శాతానికి పరిమితమైంది. అయితే నాలుగేళ్ల కాలంలోనే భాజపా రాష్ట్రం నలుమూలాల వ్యాపించింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరకపోవడం, అధికార పార్టీ నేతల, కార్యకర్తల అవినీతిపై అన్ని వర్గాల ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది.  ప్రత్యేకించి రాష్ట్రంలో దాదాపు 30 శాతం జనాభా ఉన్న ఆదివాసీలు, దళిత వర్గాలు పేదరికంలో ఉన్నాయి. వారికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు చేరడం లేదు. అదే విధంగా ఉత్తర బెంగాల్‌లో బంగ్లాదేశ్‌ నుంచి వలసలపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు కమలంవైపు మొగ్గు చేపే అవకాశముంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు గ్రామస్థాయి నుంచి గణనీయమైన బలముంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆ పార్టీకి పట్టువుంది. దీంతో 2021 ఎన్నికలు అధికార తృణమూల్‌కు ప్రబల శక్తిగా ఎదుగుతున్న భాజపాకు మధ్య హోరాహోరీ పోరుగా మారనున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇదీ చదవండి

మహారాష్ట్రలో మళ్లీ గవర్నర్‌ వర్సెస్‌ సీఎం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని