ఎమర్జెన్సీగా ప్రకటించడంలో WHOదే ఆలస్యం!
close

తాజా వార్తలు

Published : 13/05/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమర్జెన్సీగా ప్రకటించడంలో WHOదే ఆలస్యం!

ఈ విపత్తు నివారించగలిగిందేనన్న అంతర్జాతీయ నిపుణుల బృందం 
WHOలో సంస్కరణలు అవసరమని సూచన

లండన్‌: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటి వరకు 33 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే, ఈ విపత్తును ఎదుర్కొనే సమయంలో తీసుకున్న పేలవమైన నిర్ణయాల పరంపరే ప్రస్తుత సంక్షోభానికి కారణమని మహమ్మారి సంసిద్ధతపై ఏర్పడిన అంతర్జాతీయ నిపుణుల బృందం అభిప్రాయపడింది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు నివారించడానికి ఓ ‘అంతర్జాతీయ అప్రమత్త వ్యవస్థ’ అవసరమని ‘కొవిడ్‌-19: మేక్‌ ఇట్‌ ఇన్‌ ది లాస్ట్‌ పాండమిక్‌’ పేరుతో రూపొందించిన నివేదిక సూచించింది. మహమ్మారిని అత్యవసర స్థితిని ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆలస్యం చేసిందన్న నిపుణుల బృందం.. WHOలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.

‘‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి నివారించగలిగిందే. చైనాలోని వుహాన్‌లో 2019 డిసెంబర్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్‌ మహమ్మారిపై అత్యవసరంగా స్పందించడంలో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితిని ప్రకటించడంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆలస్యం చేసింది. దీంతో అత్యంత విలువైన నెల (ఫిబ్రవరి 2020) కాలన్ని ప్రపంచదేశాలు కోల్పోయాయి’’ అని ‘ది ఇండిపెండెంట్‌ ప్యానెల్‌ ఫర్‌ పాండమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ అండ్‌ రెస్పాన్స్‌ (ఐపీపీపీఆర్‌)తన నివేదికలో పేర్కొంది. వీటితో పాటు వివిధ దేశాల పేలవమైన వ్యూహాలు, సమన్వయం లేని వ్యవస్థలు కలిసి ఈ విపత్తు మానవ సంక్షోభంగా మారడానికి కారణమయ్యాయని విశ్లేషించింది.

నూతన వ్యవస్థ అవసరం..

ప్రజలను రక్షించుకోవడంలో వ్యవస్థలు విఫలమవడంతో పాటు సైన్స్‌ను తిరస్కరించే నాయకులు ఆరోగ్య వ్యవస్థలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని అని ఐపీపీపీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. తొలుత మహమ్మారి ముప్పును పట్టించుకోకపోవడంతో ఇప్పుడు పరస్పరం సహకరించుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి ప్రపంచ దేశాలకు ఏర్పడిందని అభిప్రాయపడింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడాలంటే మాత్రం ధనిక దేశాలు వంద కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పేద దేశాలకు అందించాలని సూచించింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఇలాంటి మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఓ నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా డబ్ల్యూహెచ్‌ఓ వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని సూచించింది. ఇలాంటి విపత్కర సందర్భంలో డబ్ల్యూహెచ్‌ఓ నాయకత్వంతో పాటు సిబ్బంది చేస్తున్న కృషిని నిపుణుల బృందం ప్రశంసించింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 విలయం, భవిష్యత్‌లో ఏర్పడే మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతపై ఓ నివేదికను రూపొందించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సభ్యదేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని హెలెన్‌ క్లార్క్‌, లైబీరియా మాజీ అధ్యక్షుడు (2011 నోబెల్‌ బహుమతి గ్రహీత) ఎల్లెన్‌ జాన్సన్‌ సర్లీఫ్‌ అధ్యక్షతన అంతర్జాతీయ నిపుణులతో కూడిన ఓ స్వతంత్ర బృందం ఏర్పడింది. గతేడాది ఏర్పాటైన ఈ బృందం.. మహమ్మారిని ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలు, జీ7, జీ20 దేశాల మద్దతు, పేద దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా, వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు నిధులు, సాంకేతికత బదలాయింపు వంటి సూచనలతో కూడిన తుది నివేదికను తాజాగా విడుదల చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని