
తాజా వార్తలు
ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు
రజనీ డిసైడ్ అయ్యారు..
ఇంటర్నెట్‌డెస్క్
తమిళనాట రజనీకాంత్ అభిమానులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రకటన ఎట్టకేలకు వెలువడింది. జనవరిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తలైవా ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనలో ‘‘ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు’’ అన్న వాక్యం తలైవా ఆలోచన తీరును స్పష్టంగా చెబుతోంది. తలైవా స్వయంగా ఎన్నికల బరిలో ఉంటారా.. లేకపోతే పార్టీకే పరిమితమై చక్రం తిప్పుతారా అనేది వేచిచూడాలి.
సమయం మించి పోతోంది..
69ఏళ్ల రజనీకాంత్ వచ్చే ఏడాది మేలో జరిగే ఎన్నికల్లో నిలబడకపోతే మరో ఎన్నికలు వచ్చే సమయానికి ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. వయోభారం రీత్యా అప్పటికి ప్రచారం వంటివి కొంత కష్టం అవుతాయి. దీంతో రజనీ 2020 ప్రారంభంలోనే రాజకీయాలపై ప్రకటన చేసి రాష్ట్రంలో పర్యటించాలనుకున్నారు. కానీ, కొవిడ్ కారణంగా ఆ ప్రణాళికను పక్కన బెట్టాల్సి వచ్చింది. తాజాగా కొవిడ్ టీకా పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చి దేశంలో కూడా టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో ఎన్నికలకు సిద్ధం అయ్యేందుకు తలైవాకు కనీసం ఐదు నెలల సమయం లభిస్తుంది. రాజకీయాల్లో గెలిచే ఊపు ఉంటే ఆ మాత్రం సమయం సరిపోతుందన్న విషయం రజనీకి స్పష్టంగా తెలుసు.
రాజకీయ శూన్యత..
తమిళనాట అన్నాదురై, ఎంజీఆర్ తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారు డీఎంకే నేత కరుణానిధి, అన్నాడీఎంకే నేత జయలలిత మాత్రమే. వారిద్దరు రెండేళ్ల వ్యవధిలో కన్నుమూశారు. డీఎంకేపై కరుణానిధి కుమారుడు స్టాలిన్ పట్టుపెంచుకున్నా.. ఆయనకు అళగిరి రూపంలో ఇంటి పోరు ఉంది. దీనికి తోడు కరుణానిధి స్థాయిలో పాపులారిటీ లేదు. ఇక అన్నాడీఎంకే అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. భాజపా, ఇతర మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్నా.. బలమైన నాయకత్వం మాత్రం లేదు. ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య సఖ్యత అంతంత మాత్రమే. తమిళనాట కరుణానిధి, జయలలిత స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి రజనీకాంత్ మాత్రమే. ఈ రాజకీయ శూన్యత తనకు కలిసి వస్తుందని తలైవా భావిస్తున్నారు.
అవినీతి మరకలు లేకపోవడం..
ఇప్పటి వరకు తమిళనాడులో అధికారంలో ఉన్న రెండు పార్టీలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పార్టీలకు బలమైన నాయకత్వం లేకపోవడంతో రజనీకి కలిసి వస్తుందని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత తమిళ రాజకీయాలకు ఆయన బలమైన ప్రత్యామ్నాయంగా మారతారని అంచనావేస్తున్నారు. తలైవాపై భారీ అవినీతి ఆరోపణలు లేవు. లెక్కల్లో తేడాలు ఉండటంతో ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినా.. ఆ తర్వాత మాఫీ చేసింది. అది మినహా పెద్దగా వివాదాలు లేవు. ఆయన సాధారణంగా వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. కాకపోతే త్వరగా నిర్ణయాలు తీసుకోరు. మృదుభాషి, సున్నిత మనస్కుడు, వంటి అభిప్రాయాలు ఉన్నా.. అవి ఓటర్లను దూరం చేసేంత ప్రభావం చూపవు. మరో అంశం ఏమిటంటే ఆయన అన్నాడీఎంకే, డీఎంకేల నేతలైన దివంగత జయలలిత, కరుణానిధికి సమదూరం పాటించారు. వారిపై ఎటువంటి విమర్శలు చేయకపోవడం ఇప్పుడు ఆయనకు కలసి వస్తుంది.
రజనీ కాంత్‌కు సవాళ్లు..
రజనీకాంత్‌కు ఇప్పటికే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ, ఎన్నికల్లో ఫ్యాన్స్ ఒక్కరే గెలిపించరు. క్షేత్రస్థాయిలో జెండాపట్టుకొని ప్రజలను ఒప్పించే కేడర్ ఉండాలి. రజనీ తన ఫ్యాన్స్‌ను ఏ మేరకు కేడర్‌గా మలుచుకొంటారనేది వేచి చూడాలి. ఇప్పటికే ‘రజనీ మక్కళ్ మండ్రమ్’ పేరుతో ఆయన కేడర్ తలైవా రాజకీయ భవిష్యత్తుకు పునాదులేసే పనిలో ఉన్నారు. ఆయన సహచర నటుడు కమలహాసన్ ఇప్పటికే రాజకీయపక్షాన్ని స్థాపించిన విషయం తెలిసిందే. మరో సీనియర్ నటుడు విజయ్‌కాంత్ డీఎండీకే పేరుతో రాజకీయపార్టీని కొన్ని సంవత్సరాల కిందటే నెలకొల్పిన విషయం తెలిసిందే.
ఇప్పటికే రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల్లో కొత్తవారికి అవకాశాలు రావడం లేదనే అపవాదు ఉంది. దీనిని ఉపయోగించుకుంటూ ఈ ఆరు నెలల కాలంలో పార్టీని రజనీ గ్రామస్థాయి నుంచి నిర్మించుకుంటూ రావాలి. బలమైన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాలను ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే కేవలం క్రౌడ్‌పుల్లర్‌గా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ద్రవిడ రాజకీయాల్లో కుల సమీకరణాలు సైతం కీలక భూమిక పోషిస్తాయి. వీటిని రజనీ ఎలా అధిగమించగలరన్న అంశం కూడా ముఖ్యమైనదే.