
తాజా వార్తలు
ఫ్రీ వ్యాక్సిన్ ఎందరికి? ఎప్పుడిస్తారు?: కాంగ్రెస్
దిల్లీ: కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ప్రారంభమైన వేళ కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పలు కీలక ప్రశ్నలు సంధించింది. దేశంలో తొలి విడతగా 3 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నించింది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారా?లేదా? అని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు.
‘‘దేశంలో ఆహార భద్రత చట్టం కింద 81.35 కోట్ల మంది పేదలు సబ్సిడీపై సరకులు అందుకుంటున్న సంగతి ప్రభుత్వానికి తెలుసా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, బీపీఎల్.. ఇలా ఉన్న పేద, నిరుపేదలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎప్పుడిస్తారు? ప్రణాళిక ఏంటి?’’ అంటూ సూర్జేవాలా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రధాని నరేంద్రమోదీ, భాజపా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు. దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు రూపొందించిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను అత్యవసర మందుల జాబితాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ప్రజా సేవకు సంబంధించినదని.. రాజకీయాలు, ప్రచార ఆర్భాటాలకు సంబంధించిన విషయం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి..
రైతుల ఉద్యమం: 19న నిపుణుల కమిటీ భేటీ!
సంగీత విద్వాంసుడు ముస్తాఫాఖాన్ కన్నుమూత