close

తాజా వార్తలు

ఏనుగు...బలి తీసుకుంది

● గుంపు నుంచి విడిపోయిన గజరాజు ●

మహిళపై దాడి అక్కడికక్కడే మృతి

మృతురాలు చిన్నమ్మి (పాతచిత్రం)

జియ్యమ్మవలస, పార్వతీపురం, న్యూస్‌టుడే : ఏనుగు.. ఈ పేరు వింటేనే జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజల్లో వణుకు పుడుతోంది.. ఏడాది కాలంగా ముప్పుతిప్పలు పెడుతూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి కరిరాజులు... వీటిని తరలించాలనే డిమాండ్‌ అరణ్యరోదనగానే మిగులుతోంది..ఇప్పటికే ముగ్గురిని బలిగొన్న కరి గుంపు తాజాగా మరొకరి ప్రాణాలు తీసేశాయి.. జియ్యమ్మవలస మండలంలో బాసంగి గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం ఓ ఏనుగు చేతిలో అసువులు బాసింది.

కనికరింపు లేకుండా తొక్కేసింది..

పార్వతీపురం డివిజనులో గతేడాది కాలంగా సంచరిస్తున్న ఏనుగుల దాడిలో జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన గంటా చిన్నమ్మి(60) మృతిచెందారు. ఏడాది కాలంగా జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, పార్వతీపురం మండలాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం విదితమే. గత వారం రోజులుగా జియ్యమ్మవలస మండలం బిత్తరపాడు, బాసంగి, వెంకటరాజపురం, సింగనాపురం, కుదమ, గౌరీపురం చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగాడుతున్నాయి. శుక్రవారం ఏనుగులు గుంపు నుంచి ఒక ఏనుగు తప్పిపోయింది. దీన్ని గుంపులోకి తిరిగి చేర్చే దిశగా ట్రాకర్లు, అటవీసిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మృతురాలు చిన్నమ్మి పొలం పనికోసం ఏనుగులు తిరుగుతున్న ప్రాంతానికి వెళ్లింది. అప్పటికే గుంపును విడిచిన ఏనుగు వాటిని వెదుకులాడే క్రమంలో కోపోద్రిక్తంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పొలం పనిలో నిమగ్నమై ఉన్న చిన్నమ్మిపై ఒక్కసారిగా దాడిచేసి ప్రాణం బలిగొంది. ఈసంఘటనతో బాసంగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. గత ఏడాది సెప్టెంబరులో శ్రీకాకుళం జిల్లా నుంచి పార్వతీపురం డివిజనులో ప్రవేశించిన ఏనుగుల దాడిలో ఇప్పటివరకు నలుగురు మృత్యువాత పడ్డారు.

గ్రామస్థుల నిరసన..

ఏడాది కాలంగా ఏనుగులను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారే తప్ప ఫలితం కనిపించడంలేదని బాసంగి గ్రామస్థులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల తరలింపు విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే తప్ప మృతదేహాన్ని తరలించడానికి తాము అంగీకరించబోమని పట్టుపట్టారు. ఎంత మంది ప్రాణాలకు పరిహారం ఇచ్చి ఖరీదు కడతారని అధికారులను ప్రశ్నించారు. ఏనుగుల సమస్యకు పరిష్కారాన్ని వెల్లడించనిదే శవాన్ని తరలించేందుకు అంగీకరించమని తేల్చిచెప్పారు. గ్రామస్థులకు సమాధాన పరచేందుకు కురుపాం రేంజీ అధికారి మురళీకృష్ణ, చినమేరంగి ఎస్‌ఐ శివప్రసాద్‌ ఘటనాస్థలానికి వెళ్లి గ్రామస్థులకు సమాధాన పరచే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలితాన్ని ఇవ్వలేదు.

వ్యవ‘సాయమే’ ఆధారం..

మృతురాలు చిన్నమ్మిది వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలంలో భర్త అప్పలస్వామి, పిల్లలు చిన్నంనాయుడు, గౌరునాయుడుతో కలిసి సేద్యం చేస్తున్నారు. కుటుంబానికి వ్యవసాయంలో తనవంతు సాయం అందిస్తూ.. రేయనక పగలనక కష్టపడే చిన్నమ్మి శుక్రవారం సాయంత్రం వరిచేను ఓవులు ఎత్తడానికి పొలానికి వెళ్లింది. చుట్టు ఉన్న పొలాల్లో ఉన్న రైతులు ఏనుగు రావడం చూసి హెచ్చరిస్తున్నా, ఏమరపాటుగా ఉన్న చిన్నమ్మి ఇదేవీ గమనించలేదు. ఒక్కసారిగా దాడిచేసి తొండంతో విసిరికొట్టింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది.

ఘటనా స్థలంలోనే మృతదేహం ఉంచి నిరసన తెలుపుతున్న బాసంగి గ్రామస్థులు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.