IPL: లీగ్‌ యూఏఈలో అయితే బాగుండు: సాహా
close

తాజా వార్తలు

Published : 22/05/2021 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: లీగ్‌ యూఏఈలో అయితే బాగుండు: సాహా

కోల్‌కతా: ఐపీఎల్ 14వ సీజన్‌ కోసం ఏర్పాటు చేసిన బయో బుడగ గతేడాది యుఏఈలో నిర్వహించినంత కఠినమైంది కాదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్‌ సాహా అన్నాడు. ఈనెల ఆరంభంలో కొవిడ్‌-19 బారిన పడిన ఆటగాళ్లలో సాహా ఒకడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల కోలుకున్న అతడు తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోబుడగపై బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. గతేడాది లాగే ఈసారి కూడా ఈ మెగా ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

‘కరోనా వైరస్‌ గురించి ముందే ఒక అంచనా వేసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే గతేడాది యూఏఈలో మాలో ఒక్కరూ నియమాలు దాటలేదు. కనీసం గ్రౌండ్ సిబ్బంది కూడా ఉల్లంఘించలేదు. ఇక్కడైతే కొంత మంది ప్రజలు, పిల్లలు సమీప గోడల నుండి మ్యాచ్‌లు చూసేవాళ్లు. ఈ విషయంలో నేను పెద్దగా మాట్లాడను కానీ, 2020లో అక్కడ టోర్నీ ఎలా సజావుగా సాగిందో మనందరం చూసే ఉన్నాం. ఈసారి ఇక్కడ నిర్వహించే సరికి కరోనా కేసులు నమోదయ్యాయి. నేను మాత్రం ఈసారి కూడా ఐపీఎల్‌ను అక్కడే నిర్వహించి ఉంటే బాగుండని అనుకుంటున్నా’నని సాహా పేర్కొన్నాడు.

ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, తన పనులు తానే చేసుకుంటున్నానని సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ వివరించాడు. అయితే, ప్రాక్టీస్‌ మొదలెట్టినప్పుడే తన శరీరం ఎలా సహకరిస్తుందోననే అంచనాకు వస్తుందని చెప్పాడు. అనంతరం కరోనా సోకినప్పటి విషయాలపై స్పందించిన అతడు తొలుత తనకు కొద్ది రోజులు జ్వరం వచ్చిందని, వైరస్‌ సోకిన ఐదు రోజులకు రుచి, వాసన కోల్పోయినట్లు తెలిపాడు. మళ్లీ నాలుగు రోజులకే సాధారణ స్థితికి చేరుకున్నానన్నాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, సినిమాలు చూడటం లాంటివి చేశానని గుర్తుచేసుకున్నాడు. మానసికంగా తానెప్పుడూ కుంగిపోలేదని సాహా చెప్పుకొచ్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని