
తాజా వార్తలు
ఏడాదిన్నరలో రూ.లక్ష కోట్ల దోపిడీ: యనమల
అమరావతి: సీఎం జగన్ పేదల రక్తాన్ని జలగ పీల్చినట్టు పీల్చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మొత్తం జే గ్యాంగ్ జేబుల్లోకి పోతోందని, పేదలపై మాత్రం పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు. జగన్ ఏడాదిన్నరలోనే పన్నులు, ఛార్జీల పెంపు ద్వారా రూ.70వేల కోట్ల భారం మోపి పేదల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నారని ఆరోపించారు.
‘‘పట్టణ భూముల విలువ పెంపుతో ప్రజలపై రూ.800 కోట్ల భారం పడనుంది. ఆస్తిపన్ను 15శాతం పెంపుతో రూ.8వేల కోట్ల భారం పడనుంది. సీఎన్జీపై 10శాతం వ్యాట్ పెంచి రూ.300 కోట్ల భారం మోపారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టానుసారం పెంచి రూ.1800 కోట్ల భారం వేశారు. దొడ్డిదారిన విద్యుత్ బిల్లులు పెంచి రూ.3వేల కోట్ల భారం మోపారు. యూజర్ ఛార్జీల పెంపుతో రూ.2,400కోట్లు, రవాణా పన్నుల పెంపుతో రూ.400 కోట్ల భారం మోపారు. నిత్యావసరాల ధరలు 200శాతం నుంచి 300 శాతం వరకూ పెంచేశారు. మద్యం రేట్లు 200 నుంచి 300 శాతం వరకు పెంచి రూ.9వేల కోట్ల భారం వేశారు. ఇసుక దోపిడీలో జే గ్యాంగ్ రూ.18వేల కోట్లు కొల్లగొట్టారు. మద్యం మాఫియాలో రూ.25వేల కోట్ల దోపిడీ జరిగింది.. మైనింగ్ మాఫియాతో రూ.30వేల కోట్ల దోపిడీ, సిమెంట్ సిండికేట్‌తో రూ.15వేల కోట్ల దోపిడీ, ఇళ్ల స్థలాలు, భూసేకరణలో రూ.4వేల కోట్ల దోపిడీ జరిగింది. ఏడాదిన్నరలో మొత్తం రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారు’’ అని యనమల ఆరోపించారు.