
తాజా వార్తలు
దీదీ సర్కార్‌పై యోగి మాటల తూటాలు
కోల్‌కతా: బెంగాల్ ఎల్లప్పుడూ సాంస్కృతిక జాతీయవాదపు నేలగానే ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో విప్లవ భూమిగా ఉన్న పశ్చిమబెంగాల్లో ఈ రోజు అరాచక వాతావరణం నెలకొనడం అందరినీ బాధిస్తోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మంగళవారం ఆయన మాల్దాలో భాజపా ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. మమత సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చారు. రాష్ట్రంలో దుర్గాపూజను కూడా నిషేధించారని, ఈద్ రోజున గోవధను బలవంతంగా ప్రారంభించారంటూ ఆరోపించారు. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న గో అక్రమ రవాణాపైనా ప్రభుత్వం మౌనంగానే ఉందన్నారు. రాష్ట్రంలో జైశ్రీరాం నినాదాన్ని కూడా నిషేధించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు దీన్ని ఎంతో కాలం కొనసాగనీయరంటూ ధ్వజమెత్తారు. గో అక్రమ రవాణా, లవ్ జిహాద్‌లను అడ్డుకోవడంలో దీదీ సర్కార్ విఫలమైందన్నారు. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన బెంగాల్.. నేడు అరాచక పరిస్థితులు ఎదుర్కోంటోందని యోగి వ్యాఖ్యానించారు.
పోలింగ్ సమయం పొడిగింపు
బెంగాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. పోలింగ్ సమయాన్ని అరగంట పాటు పొడిగించింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించింది. కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ తెలిపింది.