
తాజా వార్తలు
వీలైనంత వరకు ఏకగ్రీవం చేసుకుందాం: సజ్జల
అమరావతి: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువగా ఏకగ్రీవాలు చేసేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నించాలని వైకాపా పిలుపునిచ్చింది. ఎన్నికలతో కక్షలకు దారితీసే పరిస్థితులు వస్తున్నాయని.. ఏకగ్రీవం ద్వారా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు గ్రామాభివృద్ధికి దోహదపడతాయని ఆ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా బట్టి ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్ఠంగా రూ.20లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని.. దీన్ని పొందడంతో గ్రామాభివృద్ధి సహా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని కోరారు.
ఏకగ్రీవాలపై అవగాహన పెంచేలా ప్రచారం చేపట్టేందుకు అవసరమైన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేయడం, కక్షలు పెరిగేలా వ్యవహరించడం తదితర చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, ఎన్నికయ్యాక అనర్హత వేటు వేసేలా చట్టాన్ని కఠినంగా అమలు జరుపుతామన్నారు. గ్రామాల్లో ఎవరు బలంగా ఉంటే వారు ఏకగ్రీవం చేసుకుందామని.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు చూసుకుందామని రాజకీయ పార్టీలకు సజ్జల సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే సంక్షేమ పథకాలు చక్కగా నడుస్తాయన్నారు.
ఇవీ చదవండి..
ఏపీ..ఏక్రగీవాలకు ఇచ్చే మొత్తం పెంపు
ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ అత్యవసర భేటీ