close

అమరావతికి స్వాగత తోరణం

‘వెల్‌కం గ్యాలరీ’కి ఏపీ ముఖ్యమంత్రి శంకుస్థాపన
‘సింగపూర్‌’ హామీని నిలబెట్టుకుంటున్నా
అతి త్వరలో ప్రపంచానికే ఆదర్శమవుతాం
చంద్రబాబు వ్యాఖ్యలు
అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా తీర్చిదిద్దుతాం: ఈశ్వరన్‌

ఈనాడు, అమరావతి, తుళ్లూరు- న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అప్పటి ఆలోచనలన్నీ ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయని, రాజధాని ఒక రూపు సంతరించుకుంటోందని చెప్పారు. రాజధానిలోని అంకుర ప్రాంత అభివృద్ధి ప్రదేశంలో అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) చేపట్టే ‘వెల్‌కం గ్యాలరీ’ నిర్మాణానికి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

‘అమరావతిలో రూ.40వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెల్‌కం గ్యాలరీ రాజధానికి ముఖద్వారంగా ఉంటుంది. అత్యుత్తమ ఆచరణలు, అత్యాధునిక సాంకేతికతలను ఈ గ్యాలరీలో ప్రవేశపెట్టొచ్చు. సాంకేతికతను వినియోగించి పారదర్శక పరిపాలనను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. అతి త్వరలో ప్రపంచానికే ఆదర్శమవుతుంది.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా చేస్తాం

రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది? పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడున్న అవకాశాలేమిటనే అంశాలను ‘వెల్‌కం గ్యాలరీ’లో చూపిస్తామని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ తెలిపారు. ‘అంకుర ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన సంస్థలు ముందుకొచ్చాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా అనేక సంస్థలు వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, సృజనాత్మక ఆలోచనల వల్లే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.

15 సంస్థలతో ఒప్పందాలు
అంకుర ప్రాంత అభివృద్ధిలో భాగంగా అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) పలు సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. జర్మనీ, జపాన్‌, సింగపూర్‌తో పాటు భారత్‌కు చెందిన 15 సంస్థలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబు, ఈశ్వరన్‌ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

రూ.600 కోట్లతో శ్రీసిటీలో యాంకర్‌ కంపెనీ
జపాన్‌కు చెందిన యాంకర్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీ శ్రీసిటీలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మొదటి విడత రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టి దశలవారీగా మరో రూ.350 కోట్లు వెచ్చించనుంది. గురువారం అమరావతి వెల్‌కం గ్యాలరీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో యాంకర్‌ ఎలక్ట్రికల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టరు దినేశ్‌ అగర్వాల్‌, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) జాస్తి కృష్ణ కిశోర్‌తో ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ కూడా పాల్గొన్నారు. దాదాపు 55ఏళ్ల క్రితం ఏర్పాటైన యాంకర్‌ కంపెనీని 2007లో జపాన్‌కు చెందిన పానాసోనిక్‌ కొనుగోలు చేసింది.

ఏపీ రాజధాని అభివృద్ధి భేష్‌
సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రశంస

పీ రాజధాని అమరావతిలో అతి తక్కువ సమయంలో చాలా అభివృద్ధి సాధించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అభినందించారు. ప్రభుత్వ భవన నిర్మాణ సముదాయాలను వారిద్దరు పరిశీలించారు. 5 టవర్లుగా నిర్మిస్తున్న సచివాలయ భవనాల 2 పిల్లర్లకు వేసిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను ఈశ్వరన్‌కు చంద్రబాబు చూపించారు. అంతకు ముందు చంద్రబాబుతో కలిసి రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని ఈశ్వరన్‌ సందర్శించారు. ఆర్టీజీ పనితీరు స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రశంసించారు. రాజధాని పనుల వేగాన్ని చూసి ఈశ్వరన్‌ ఆశ్చర్యపోయారని, ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయని అనుకోలేదని వ్యాఖ్యానించారని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు.

మరోవైపు భారత్‌లోని ప్రతిభకు సింగపూర్‌ సామర్థ్యం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ఈశ్వరన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సింగపూర్‌కు చెందిన సింక్రో స్కిల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో పెళ్లి కుమార్తెల అలంకరణ, ఫొటో గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు విజయవాడలో నిర్వహించిన పట్టభద్రుల వేడుకలో ఆయన మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినుల ఫ్యాషన్‌ షో, వస్త్రాలంకరణ ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

వెల్‌కం గ్యాలరీ విశేషాలు...

విస్తీర్ణం: 5 ఎకరాలు (2.6 హెక్టార్లు)
నిర్మిత ప్రాంతం: 4,080 చ.మీటర్లు
కార్యకలాపాలు ప్రారంభమయ్యేది: 2019 అక్టోబరు చివరికి
సందర్శకుల సామర్థ్యం: రోజుకు 2వేల నుంచి 3వేల మంది

ఏమేం ఉంటాయి?

సిటీ గ్యాలరీ: ఆంధ్రప్రదేశ్‌ ఔన్నత్యాన్ని, ఇక్కడి ప్రజల సంస్కృతిని గుర్తు చేసేలా..
ఎగ్జిబిషన్‌ జోన్‌: కళలు, వినూత్న సాంకేతికత, అర్బన్‌ సొల్యూషన్స్‌కు వేదిక.
సామాజిక ప్రదేశాలు (కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ ఏరియా): కన్వెన్షన్‌ సెంటర్లు, వినోద, విహార జోన్లు, ఆరోగ్య కేంద్రాలు.
పని ప్రదేశాలు (కో-వర్కింగ్‌ జోన్లు): రాజధానిలో అంకుర ప్రాంత అభివృద్ధిని ప్రోత్సహించే కేంద్రాలు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.