close

పంటల బీమా.. మరింత ధీమా

కోతులు.. వన్యమృగాలు నష్టపరిచినా పంటకు పరిహారం
రెండు సీజన్లకూ ఒకేసారి.. మార్చిలోనే నోటిఫికేషన్‌
పంటల బీమా రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ నిర్ణయం
బీమా సంస్థల పనితీరుపై అసంతృప్తి, ఆగ్రహం

ఈనాడు, హైదరాబాద్‌: కోతులు.. అడవి పందులు పొలాల మీదపడి.. ఏపుగా పెరిగిన పంటను ధ్వంసం చేస్తే కన్నీరు మున్నీరవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి రైతులది. ఇకమీదట అలాంటివాటికి కూడా బీమా పరిహారం పొందవచ్చు. కోతులు, అడవిపందులు, జింకల వంటి వన్యప్రాణులు పంటలకు చేసిన నష్టానికి కూడా పరిహారం దక్కనుంది. దీంతోపాటు మెరుపుల కారణంగా మంటలు చెలరేగి పంటనష్టం కలిగినా, అసాధారణ వర్షంతో దెబ్బతిన్నా పరిహారం ఇస్తారు. కేంద్ర పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను చేర్చింది. సవరించిన మార్గదర్శకాలతో వచ్చే మార్చి నుంచి దీనిని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్రస్థాయి పంటల బీమా సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ కమిషనర్‌, ఉద్యానవన, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించి ఆమోదించారు. గతంలో బీమా నోటిఫికేషన్లు రెండు సీజన్లకు వేర్వేరుగానూ.. అదీ ఆలస్యంగానూ జారీ అయ్యేవి. కొత్త విధానం కింద రెండు సీజన్లకు ఒకేసారి.. వచ్చే మార్చిలోనే పంటల బీమా నోటిఫికేషన్‌ జారీ చేయాలని సమావేశం నిర్ణయించింది.
* ఇప్పటి వరకు అడవి పందులు, కోతులు, జింకలు పంటను నాశనం చేస్తే పరిహారం అందేది కాదు. తాజా నిబంధనల మేరకు వాటికీ పరిహారం వస్తుంది. ఏదైనా ఒక జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తారు.
* పొలాల్లో మెరుపుల కారణంగా మంటలు రేగినా.. ఒకేసారి పెద్ద వర్షం పడి నష్టం జరిగినా గతంలో బీమా అమలయ్యేది కాదు. ఇకపై వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని పరిహారం అందిస్తారు. దీనిని కూడా ముందుగా ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టి తర్వాత విస్తరిస్తారు.
* ఉద్యాన పంట అయిన టమాటాను వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో చేర్చాలని నిర్ణయించారు. దీనిని ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు.
* ఆరు వ్యవసాయ సమూహాల కింద మొత్తం అన్ని జిల్లాల్లో ఫసల్‌ యోజనను అమలు చేస్తారు.

బీమా సంస్థల నిర్లక్ష్యం
పంటల బీమా పథకం అమలుపై బీమా సంస్థలు నిర్లక్ష్యం చూపుతున్నాయని ఈ సందర్భంగా పార్థసారథి సహా ఇతర అధికారులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బీమా పథకం అమలుకు సరిగా సిబ్బందిని నియమించకపోవడం వల్ల రైతులకు సరైన సమాచారం అందడం లేదని తెలిపారు. వెంటనే సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. ఏమైనా సమాచారం పొందాలన్నా ఫోన్‌ సౌకర్యం లేదని.. తెలుగులో సమాచారం అందించేందుకు టోల్‌ఫ్రీ నంబరును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.