close
పది అభియోగాలపై సీవీసీ విచారణ నివేదిక

ఆలోక్‌కు వ్యతిరేకంగా నాలుగు కేసుల్లో ఆధారాలు లభ్యమైనట్లు వెల్లడి

దిల్లీ: ఆలోక్‌ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) సమర్పించిన విచారణ నివేదికలో పది ప్రధాన అభియోగాలున్నాయి. నాలుగు కేసుల్లో ఆలోక్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సీవీసీ ఇందులో పేర్కొంది. భారత గూఢచర్య సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) చేపట్టిన ఫోన్‌ ట్యాపింగ్‌ల వివరాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఈట్యాపింగ్‌ల్లో ‘నగదు చేతులు మారడంలో సీబీఐ డైరెక్టర్‌ పాత్ర’ గురించిన సంభాషణలున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. వివాదాస్పద మాంస వ్యాపారి మోయిన్‌ ఖురేషీ నుంచి రూ.2 కోట్లు ముడుపులు తీసుకున్న కేసులో ఆలోక్‌ తీరు అనుమానాస్పదంగా ఉందని..విచారణ జరిగితే వాస్తవాలు వెలుగుచూస్తాయని సీవీసీ ఈ నివేదికలో వ్యాఖ్యానించింది. మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ నిందితుడిగా ఉన్న ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసు నుంచి రాకేశ్‌ సక్సేనా పేరును తప్పించాలని ప్రయత్నించినందుకు ఆలోక్‌పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. విధుల్లో అలసత్వం వహించడం ద్వారా ఆలోక్‌ రాంచీ  బ్యాంకు కుంభకోణం కేసులో రాజీవ్‌ సింగ్‌ అనే సీబీఐ అధికారికి అనుకూలంగా వ్యవహరించినట్లు పేర్కొంది. అవినీతి మచ్చలున్న అధికారులను సీబీఐలోకి తీసుకువచ్చేందుకు ఆలోక్‌ ప్రయత్నించినట్లూ ఆధారాలు లభించాయని వివరించింది. ఆలోక్‌పై రాకేశ్‌ అస్థానా మోపిన ఈ పది అభియోగాలతోపాటు.. లఖ్‌నవూకు చెందిన సీబీఐ అధికారి చేసిన మరో ఐదు ఆరోపణలపైనా సీవీసీ విచారణ జరిపింది.

మోదీకి నిద్ర పట్టట్లేదు

‘ప్రధాని మోదీ మదిని భయం తొలిచేస్తోంది. ఆయనకు నిద్ర పట్టట్లేదు. అనిల్‌ అంబానీకి భారత వైమానిక దళం నుంచి ఆయన రూ.30 వేల కోట్లు దోచిపెట్టారు. వరుసగా రెండుసార్లు సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించడం చూస్తే మోదీ స్వీయ అసత్యాల్లో బందీగా చిక్కుకున్నట్లు స్పష్టమవుతోంది. సత్యమేవ జయతే’
- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

ప్రధాని భయపడుతున్నారు

‘రఫేల్‌ ఒప్పందంపై స్వతంత్ర సీబీఐ డైరెక్టర్‌తో లేదా సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)తో జరిగే దర్యాప్తునకు తాను కూడా భయపడుతున్నానని.. వాదన వినిపించుకునే అవకాశమివ్వకుండానే ఆలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించడం ద్వారా ప్రధాని మోదీ మరోసారి చాటుకున్నారు’
- అధికారిక ట్విటర్‌ ఖాతాలో కాంగ్రెస్‌

ఈ నిర్ణయం దురదృష్టకరం

‘‘ఆలోక్‌ వర్మను బదిలీ చేయాలన్నది అత్యున్నత స్థాయి కమిటీలోని మెజార్టీ నిర్ణయమైతే అది దురదృష్టకరం. వర్మపై ఉన్న అభియోగాలకు సంబంధించి ఆయన వివరణను ఎందుకు కోరలేదన్నది నాకు అర్థం కావడంలేదు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)పై నాకు మంచి అభిప్రాయం లేదు.’’
- సుబ్రమణ్య స్వామి, భాజపా నేత

ఎఫ్‌ఐఆర్‌ నమోదు అవుతుందేమోనని..

‘‘అత్యున్నత స్థాయి కమిటీలో ప్రధాన మంత్రి ఉండటం ప్రయోజన వైరుద్ధ్యమవుతుంది. రఫేల్‌ కుంభకోణంలో తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యే అవకాశం ఉందని మోదీ ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది.
-ప్రశాంత్‌ భూషణ్‌, సీనియర్‌ న్యాయవాది

సీబీఐ అంతర్గత ఘర్షణల్లో కాంగ్రెస్‌ జోక్యం

‘‘సీబీఐలో అంతర్గత ఘర్షణల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆ దర్యాప్తు సంస్థను దారిమళ్లించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. సీవీసీ ఎదుట తన వాదనను వినిపించుకునేందుకు వర్మకు అవకాశం లభించింది. సీవీసీ నివేదికను వర్మ తరఫు న్యాయవాదికి సుప్రీం కోర్టు అందజేసింది.’’
-జీవీఎల్‌ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.