close
సార్వత్రిక ఎన్నికలకు కసరత్తు మెుదలు

నేడూ, రేపూ రాష్ట్రాల ఎన్నికల ముఖ్యఅధికారుల సమావేశం

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా శుక్ర, శనివారాల్లో రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారుల సదస్సు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన అన్ని ముఖ్య అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఓటర్ల జాబితా, మానవ వనరుల అందుబాటుతోపాటు, ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఇతరత్రా వనరుల గురించి అధికారులను అడిగి తెలుసుకోనుంది. ఈ సందర్భంగా ప్రతి రాష్ట్ర సీఈఓ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లకు ఇప్పటివరకూ తీసుకున్న చర్యలపై దృశ్యరూపకంలో వివరణ ఇవ్వనున్నారు.

1950 నెంబర్‌తో హెల్ప్‌ లైన్‌
ఓటర్ల జాబితాల్లో పేర్లు లేని వారు వెంటనే నమోదు చేసుకొనేలా ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఈఓలను నిర్దేశించింది. జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎస్‌ఎంఎస్‌లు, వెబ్‌సైట్‌ ద్వారా తనిఖీ చేసుకొనే అవకాశం ఓటర్లకు కల్పించింది. 1950 నెంబర్‌ ద్వారా ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించనుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా కల్పించిన సౌకర్యాలు ఓటర్లకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని సమీక్షించనుంది.
పోలింగ్‌కు 48 గంటల ముందు సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలకు సంబంధించి విషయాల ప్రసారాన్ని నియంత్రించడంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ గురువారం తన నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించింది. అధ్యయన కమిటీకి నేతృత్వం వహించిన సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా నివేదిక ప్రతిని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, మరో కమిషనర్‌ అశోక్‌ లవాసాలకు అందించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు విస్తృతమైన నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 126వ సెక్షన్‌పై అధ్యయనం కోసం ఎన్నికల సంఘం 2018 ఏప్రిల్‌ 24వ తేదీన 14 మంది సభ్యులతో కమిటీ వేసింది. సెక్షన్‌ 126 ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు టీవీలు, ఇతర ప్రసార సాధనాల్లో ఎన్నికల విషయాలు చూపడం నిషేధం. ఈ సెక్షన్‌ పరిధిలోకి కొత్తగా ఉద్భవించిన సామాజిక, ఇతర మీడియాలను చేర్చలేదు. ఇప్పుడు వాటిని చేర్చడం గురించి ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. బహుళ దశల్లో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో 48 గంటల నిషేధాన్ని అమలు చేసేలా ప్రసార మాధ్యమాలను నియంత్రించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడంపై కూడా సిఫార్సులు చేసినట్లు సమాచారం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.