close
చిన్న వ్యాపారులకు జీఎస్టీ మినహాయింపు

రూ.40 లక్షల వార్షిక టర్నోవర్‌ వరకు వెసులుబాటు
సంవిధానం పథకం పరిమితి రూ.1.5 కోట్లకు పెంపు
ఏడాదికి ఒక రిటర్ను సమర్పిస్తే చాలు: ఆర్థిక మంత్రి జైట్లీ

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో అస్త్రాన్ని సంధించింది. చిన్నవ్యాపారులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆకట్టుకోవడంలో భాగంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)లో మినహాయింపులు ప్రకటించింది. ఖాతాలు, బిల్లుల రూపకల్పన నిమిత్తం వారికి ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను కూడా అందించనుంది. గురువారం జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చే వార్షిక టర్నోవర్‌; సంవిధాన పథకం (కాంపొజిషన్‌ స్కీం) విషయాల్లో మార్పులు చేసింది. ఈ నిర్ణయాలన్నీ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

జీఎస్టీ వర్తించే వార్షిక టర్నోవర్‌ పరిమితి రెట్టింపు
ప్రస్తుతం వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలు పైబడిన వారంతా జీఎస్‌టీ పరిధిలోకి వస్తున్నారు. ఇకపై ఆ పరిమితిని రూ.40 లక్షలకు పెంచారు. అంటే రూ.40 లక్షల వార్షిక టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు ఎలాంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ కూడా చేయించాల్సిన పనిలేదు. ఈశాన్య రాష్ట్రాలకయితే ప్రస్తుతం రూ.10 లక్షల టర్నోవర్‌ ఉన్నవారికి ఈ మినహాయింపులు ఉన్నాయి. అక్కడ ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు.

చిన్న షరతు
ఒక రాష్ట్రం పరిధిలో జరిగే వ్యాపారానికే టర్నోవర్‌ పరిమితి పెంపు నిబంధన వర్తిస్తుంది. అంతర్రాష్ట్ర వ్యాపారం చేసే వారికి వర్తించబోదని రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. ప్రస్తుతం రూ.20 లక్షల టర్నోవర్‌ కన్నా తక్కువ ఉన్నప్పటికీ 10.93 లక్షల మంది జీఎస్‌టీ చెల్లిస్తున్నారని చెప్పారు. వారందరికీ ఊరట కలగనుంది.

పెంచడం, పెంచకపోవడం రాష్ట్రాల ఇష్టం
టర్నోవర్‌ పరిమితిని పెంచడం కారణంగా రాష్ట్రాలు రూ.5,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి ఉంటుంది. అందువల్ల పరిమితిని పెంచాలా, వద్దా అన్న నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకు విడిచిపెట్టారు. టోర్నోవర్‌ పరిమితి పెంపు వల్ల పన్ను చెల్లించే వారి సంఖ్య తగ్గుతుందని, అందువల్ల ఆదాయాన్ని కోల్పోతామని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ విషయాన్ని ఆయా రాష్ట్రాలు వారం రోజుల్లోగా జీఎస్‌టీ మండలి సెక్రటేరియట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. పుదుచ్చేరి ఈ ప్రతిపాదన చేసిందని అరుణ్ జైట్లీ తెలిపారు. ఇది ఏకకాల మినహాయింపు మాత్రమేనని స్పష్టం చేశారు. దీని ప్రభావం అంతర్రాష్ట్ర వ్యాపారంపై ఉండబోదని తెలిపారు.

ప్రయోజనం ఏమిటి?
సంవిధాన విధానాన్ని ఎంచుకున్న వ్యాపారులకు మూడు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి..ఏడాదికి ఒక రిటర్ను సమర్పిస్తే సరిపోతుంది. రెండు.. నెలనెలా కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్ను చెల్లించే వెసులుబాటు ఉంటుంది. మూడు...మిగిలిన పన్ను చెల్లింపుదారుల మాదిరిగా సవివరమైన దస్త్రాలు నిర్వహించవలసిన అవసరం లేదు.

కేరళకు ప్రత్యేక వెసులుబాటు
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళకు అదనంగా నిధులు సమీకరించుకోవడానికి జీఎస్‌టీ మండలి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అంతర్రాష్ట్ర వ్యాపారంపై 1 శాతం వైపరీత్యాల సెస్సు విధించుకునే అవకాశం ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది.

స్థిరాస్తిపై ఏడుగురు మంత్రుల అధ్యయనం
స్థిరాస్తి రంగంపై ఎంత జీఎస్‌టీ ఉండాలన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో దీనిపై అధ్యయనానికి ఏడుగురు మంత్రులతో బృందం ఏర్పాటయింది. లాటరీ వ్యవహారాలపైనా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.

చిన్నవ్యాపారులంతా సంవిధాన పథకంలోకి...

చిన్నవ్యాపారులంతా సంవిధాన పథకంలోకి వచ్చేలా జీఎస్‌టీ రెండు మార్పులు చేసింది.
మొదటిది: ఈ పథకం కింద ప్రస్తుతం రూ.కోటి వార్షిక టర్నోవర్‌ ఉన్న చిన్న వ్యాపారులు 1 శాతం జీఎస్‌టీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ టర్నోవర్‌ను రూ.1.5 కోట్లకు పెంచింది. పన్ను శాతంలో మార్పులు చేయలేదు. వస్తువుల తయారీదార్లు, సరఫరాదార్లకు ఇది ఉపకరిస్తుంది. రూ.40 లక్షల వరకు మినహాయింపును ఉపయోగించుకోవడంతో పాటు, ఆ పైన ఉన్న టర్నోవర్‌కు 1 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
రెండోది:  రూ.50 లక్షల వార్షిక టర్నోవర్‌ ఉన్న వస్తు, సేవల సర్వీసు ప్రొవైడర్లు, సరఫరాదారులు సంవిధాన విధానాన్ని ఎంచుకొని 6%పన్ను చెల్లిస్తే సరిపోతుంది. సేవల రంగంలో ఉన్నవారికి లబ్ధి కలుగుతుంది.

బయట ఒకలా.. లోపల మరోలా..
- కాంగ్రెస్‌ను విమర్శిస్తూ మోదీ ట్వీట్‌

జీఎస్‌టీ విషయంలో కాంగ్రెస్‌ బయట ఒకలా...లోపల మరోలా వ్యవహరిస్తోందంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘జీఎస్‌టీ వర్తించే పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాం. కేరళ, ఛత్తీస్‌గఢ్‌ మాత్రం రూ.20 లక్షలకే పరిమితం చేయాలని పట్టుబట్టాయి. అందుకే స్వేచ్ఛను రాష్ట్రాలకే ఇచ్చాం. సంవిధాన విధానంలో రూ.50 లక్షల వార్షిక టర్నోవర్‌ ఉన్నవారికి 6% పన్ను వేశాం. ఛత్తీస్‌గఢ్‌, ఇతర కాంగ్రెస్‌ రాష్ట్రాలు 8% పన్ను ఉండాలని అడిగాయి. కాంగ్రెస్‌ పార్టీ బయట పన్నులు తగ్గించాలని అడుగుతోంది. సమావేశాల్లో మాత్రం అధిక పన్నుల రేటు కోసం పోట్లాడుతోంది’’ అంటూ విమర్శలు చేశారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.