close

ఉపసర్పంచి స్థానానికీ గిరాకీ 

అధికారాలు ఉండటమే కారణం 
వార్డు సభ్యులకూ భారీగా నామినేషన్లు 
పారిశ్రామిక ప్రాంతాల్లో పంచాయతీ చిత్రం 
ఈనాడు - హైదరాబాద్‌

గ్రామ పంచాయతీ ఎన్నికలు కొన్ని జిల్లాల్లో రసవత్తరంగా మారాయి. సర్పంచి స్థానానికి పోటీ చేద్దామని పార్టీల మద్దతు ఆశించి భంగపడిన కొందరు ఉప సర్పంచి స్థానంపై దృష్టి సారించారు. ఉపసర్పంచికి కూడా సర్పంచి స్థాయిలో కొన్ని అధికారాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 4,479 పంచాయతీల్లోని 39,822 వార్డులకు 97,690 నామినేషన్లు దాఖలయ్యాయి.వీటిలో ఆదాయ వనరులు బాగున్న పంచాయతీల్లో నామినేషన్లు ఎక్కువగా దాఖలవడం విశేషం. పరిశ్రమలున్న ప్రాంతాలు, స్థిరాస్తి వ్యాపారం జోరు మీదున్న పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలకు కూడా పెద్దఎత్తున పోటీ నెలకొంది. ఇక్కడ పంచాయతీల ఆదాయం అధికంగా ఉండటంతో పాటు రాజకీయంగానూ పలుకుబడి అక్కరకొస్తుంది. స్థానిక అనుమతులు పంచాయతీలే ఇవ్వాల్సి ఉండటంతో పరిశ్రమల యజమానులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటుంటారు. ఇక్కడ వార్డు సభ్యుడైనా చాలు అనేంత ప్రాధాన్యం ఉంటుంది. దీంతో పాటు పైరవీలు, పై సంపాదన గిట్టుబాటు అవుతుందన్న ఆశతో ఈ ప్రాంతాల్లో వార్డు సభ్యులుగా పోటీకి పలువురు బారులు తీరినట్లు తెలుస్తోంది. పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారం, గుమ్మడిదల, పటాన్‌చెరు మండలాల్లోని కొన్ని పంచాయతీలకు వార్డు సభ్యుల స్థానాలకు కూడా పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడం విశేషం.

సర్పంచి స్థాయిలో ప్రచారం 
సర్పంచిగా గెలవాలంటే అన్ని వార్డుల నుంచి ఎక్కువ ఓట్లు పొందాలి. ఉపసర్పంచిగా ఎన్నికవ్వాలంటే ఎక్కువ మంది వార్డు సభ్యుల మద్దతు అవసరం. అందుకే సర్పంచి అభ్యర్థులు, ఉపసర్పంచి ఆశావహులు అన్ని వార్డుల్లోనూ ప్రచారం చేస్తున్నారు. కొన్నిచోట్ల వార్డు సభ్యుల విజయానికి తాము కూడా ఖర్చు చేస్తున్నారు. శంషాబాద్‌, షాద్‌నగర్‌, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, బాలానగర్‌, జడ్చర్ల, మిడ్జిల్‌తోపాటు మేడ్చల్‌, కరీంనగర్‌ జిల్లా మైదాన ప్రాంతాల్లోని పంచాయతీల్లో ఈ తరహా ప్రచారం జోరుగా సాగుతోంది.

చెయ్యెత్తితే ఉపసర్పంచి 
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను నేరుగా ఎన్నుకుంటారు. ఎన్నికలయ్యాక ఎక్కువ మంది వార్డు సభ్యులు ఎవరిని బలపరిస్తే (చెయ్యెత్తితే) వారు ఉపసర్పంచి అవుతారు. వెంచర్లకు అనుమతులు, పరిశ్రమల స్థాపనకు పంచాయతీ ఆమోదం తెలపటం, కీలక నిర్ణయాల్లో సభ్యుల ఆమోదం వంటి విషయాల్లో వార్డు సభ్యులకు ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటప్పుడు మెజారిటీ సభ్యుల మద్దతు ఉండే ఉపసర్పంచి పాత్ర కీలకంగా మారుతుంది. పలు అనుమతులకు సర్పంచి తర్వాత ఉపసర్పంచిని కూడా సంప్రదించాల్సి ఉండటంతో ఈ స్థానానికి ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. కొన్ని పంచాయతీల్లో ఉపసర్పంచి ఆశావహులు వార్డు సభ్యుల్లో తనవాళ్లు ఎక్కువమంది నెగ్గేలా రాయ‘బేరాలు’ కూడా చేసుకుంటున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.